Mon Dec 23 2024 05:32:53 GMT+0000 (Coordinated Universal Time)
Raghu Rama Krishna Raju : గోకడమెందుకు సామీ... కెలుక్కుని మరీ కిందకు నీళ్లు తెచ్చుకుంటున్నారా?
ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు శివరామరాజు రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.. కానీ మొన్నటి వరకూ నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రఘురామ కృష్ణరాజు తన నోటితోనే రాజకీయాల్లో హీరో అయ్యారంటారు కొందరు. విలన్ గా మారాటంటారు మరికొందరు. అయితే ఆయన వ్యక్తిగత విషయం. ఏ పార్టీలో ఉండాలి? ఎవరిపై విమర్శలు చేయాలన్నది ఆయన పర్సనల్ ఇష్యూ. 2019 ఎన్నికల్లో తొలుత టీడీపీలో చేరి చివరి నిమిషంలో వైసీపీలో చేరి నరసాపురం వైసీపీ పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీగా గెలిచిన ఏడాదిలోపే వైసీపీ అధినేత జగన్ తో శత్రుత్వం పెంచుకున్నారు. ఆ విషయాలను గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.
పిలిచి ఇస్తారనుకుంటే...
తర్వాత తనకు పార్టీలు పిలిచి సీటు ఇస్తాయని భావించిన రఘురామ కృష్ణరాజుకు బీజేపీ షాకిచ్చింది. నరసాపురం పార్లమెంటు టిక్కెట్ మాత్రం ఇవ్వలేదు. ఆయన పేరును అస్సలు పరిగణనలోకి కూడా తీసుకోలేదు. డబ్బుకు డబ్బు... సామాజికవర్గానికి సామాజికవర్గం ఉన్పప్పటికి కూడా ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదంటే వాళ్లకున్న ఇన్ఫర్మేషన్ వేరే విధంగా ఉంటుందన్నది పార్టీ నేతలే నేరుగా చెబుతున్నారు. ఆయన రాజుగారి దర్పంతో తనను అందరూ గౌరవించాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ .. తాను అందరిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావించడమే పెద్ద తప్పు అని సొంత సామాజికవర్గానికి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. అందుకే రఘురామ కృష్ణరాజును బీజేపీకి దూరంగా పెట్టిందని చెబుతున్నారు. తనకు టిక్కెట్ రాకపోవడానికి వైసీపీయే కారణమంటూ ఆయన చెప్పినా వినేవారు ఎవరూ లేరిక్కడ అంటున్నారు.
ఉండి టిక్కెట్ దక్కడంతో...
సరే...చివరకు ఆయన కోరిక ఫలించింది. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా నరసాపురం టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ అంగీకరించపోవడంతో చివరకు ఉండి అసెంబ్లీ టిక్కెట్ ను రఘురామ కృష్ణరాజుకు ఇచ్చారు. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఆయన ఈనిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పిలిచి సంప్రదింపులు జరిపి, ఏ పరిస్థితుల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుందో వివరించిన చంద్రబాబు రామరాజుకు రాజకీయ భవిష్యత్ పై హామీ ఇవ్వడంతో ఆయన అంగీకరించారు. అంతటితో సమస్య పూర్తయిందనుకున్నా రఘురామ కృష్ణరాజుకు ఇప్పుడుకొత్త సమస్య తలెత్తింది. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నిజానికి ఆయనను తన సామాజికవర్గం పెద్దలతో బుజ్జగించి పోటీనుంచి తప్పుకునే ప్రయత్నం రఘురామ కృష్ణరాజు చేయాల్సి ఉండింది.
సముదాయించాల్సింది పోయి...
కానీ రఘురామ కృష్ణరాజు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయనపై కూడా మండిపడ్డారు. వైసీపీ నుంచి శివరామరాజు ప్యాకేజీ తీసుకుని తననను ఓడించడానికి పోటీలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఉండి నియోజకవర్గంలో క్షత్రియ సామాజికవర్గీయులు ఎక్కువ. ఏ పార్టీ నుంచి గెలిచినా ఇక్కడ రాజులే గెలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి ఇప్పటి వరకూ జరిగిన పదహారు సార్లు ఎన్నికల్లోనూ రాజులే గెలిచారు. అయితే వివిధ పార్టీల నుంచి గెలిచారు. మరోవైపు ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఉంది. గతంలో కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ రఘురామ కృష్ణరాజు పోటీ చేస్తుండటంతో పాటు 2009, 2014లో వరసగా టీడీపీ నుంచి గెలిచిన శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఖచ్చితంగా టీడీపీ ఓట్లకు గండి కొడతారన్నది మాత్రం వాస్తవం. అంటే ఎంత మేరకు శివరామరాజు టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు నష్టం చేకూరుస్తారు? ఈ లోపు ఆయనను పోటీ నుంచి విరమింప చేస్తారా? అన్నది మాత్రం చూడాల్సి ఉంది.
Next Story