Mon Dec 23 2024 11:25:43 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : గెలిచి బెజవాడ బెబ్బులి అవుతారా? లేక ఎప్పటిలాగే హిస్టరీని రిపీట్ చేస్తారా?
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎవరూ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన దాఖలాలు కూడా లేవు
విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినేని నాని ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? ఆయన గెలుపు అంత సులువుగా ఉండనుందా? అంటే అంత సులువు కాదన్నది మాత్రం పరిశీలకుల వాదన. బెజవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినేని నాని ఇప్పటికి రెండు సార్లు విజయం సాధించారు. 2024, 2019 ఎన్నికల్లో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. కానీ ఈసారి ఆయన పార్టీ మారి వైసీీపీనుంచి పోటీచేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ ఇంతవరకూ గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థానంలో ఎవరు వైసీపీ నుంచి బరిలోకి దిగినా వారు ఓటమి చెందుతూనే ఉన్నారు.
హ్యాట్రిక్ కొట్టిన నేతలు కూడా...
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎవరూ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన దాఖలాలు కూడా లేవు. 2004, 2009 ఎన్నికలలో లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు. 2014 ఎన్నికల నుంచి ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. పర్వతనేని ఉపేంద్ర 1996, 1998 లో రెండు సార్లు విజయం సాధించారు. తర్వాత 1999లో విజయవాడ నుంచి గద్దె రామ్మోహనరావు ఎన్నికయ్యారు. అయితే 19662, 1967, 1971లో మాత్రం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కెఎల్ రావు ఒక్కరే మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 1977 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ వివిధ కారణాలతో హ్యాట్రిక్ విజయాలు ఎవరికీ లభించలేదు.
ఇప్పటి వరకూ వైసీపీ....
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైసీపీ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోయింది. అంటే కొంత క్రాస్ ఓటింగ్ పడిందనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ కమ్మ సామాజికవర్గం నేతలే ఎక్కువగా గెలుస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. అన్ని పార్టీలూ ఆ సామాజికవర్గానికే టిక్కెట్లు ఇస్తారు. కేశినేని నాని అదే సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ కమ్మ వారికి పూర్తి వ్యతిరేకం. చంద్రబాబును ఎదిరించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడం, చంద్రబాబు, లోకేష్ లపై తరచూ విమర్శలు చేస్తుండటం కూడా ఒక వర్గం వారికి కేశినేని నాని అంటే నచ్చడం లేదు. ఈ కారణంగానే సొంత సామాజికవర్గం నేతల నుంచే నానికి వ్యతిరేకత ఎదురవుతుంది.
మంచి పేరున్నా...
కేశినేని నాని స్వతహాగా నలుగురికి సాయపడే నేతగా పేరుపొందారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో కేశినేని నానికి ప్రత్యేక వర్గం ఉంది. అయితే ఆ వర్గం ఎంత వరకూ నాని గెలుపునకు ఉపయోగపడుతుందన్నది చూడాలి. మరొక వైపు కేశినేని నానిపై పోటీకి దిగింది టీడీపీ నుంచి ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని కావడం కూడా ఒకింత ఇబ్బంది అంటున్నారు. ఒకవేళ కేశినేని నాని గెలిస్తే మాత్రం దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్రను తిరిగి రాసినట్లే. అదే ఓటమిపాలయితే మాత్రం చరిత్ర పునరావృతమవుతుందని చెప్పక తప్పదు. మొత్తం మీద విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కేశినేని నాని వైసీపీ జెండా ఎగురవేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story