Mon Dec 23 2024 11:35:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Vijayamma : కన్నపేగుల మధ్య తల్లడిల్లుతున్న విజయమ్మ.. ఇద్దరినీ వదులుకోలేక... ఒకరికి మద్దతివ్వలేక
వైఎస్ కుటుంబంలో భారీ చీలిక వచ్చింది. అన్న ఒక పార్టీ.. సోదరి మరొక పార్టీకి చీఫ్లుగా ఉన్నారు.
వైఎస్ కుటుంబంలో భారీ చీలిక వచ్చింది. అన్న ఒక పార్టీ.. సోదరి మరొక పార్టీకి చీఫ్లుగా ఉన్నారు. ఒకే రాష్ట్రంలో ఎన్నికలను అన్నా చెల్లెళ్లు ఎదుర్కొంటున్నారు. ఇద్దరిదీ రాజకీయంగా వేర్వేరు దారులయ్యాయి. అన్న ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో సోదరి వైఎస్ షర్మిల ప్రయత్నిస్తుండగా, ఈ ఎన్నికలో గెలిచి వైఎస్ లెగసీ తనదేనని చెప్పాలని భావిస్తున్నారు వైఎస్ జగన్. ఇద్దరి మధ్య తల్లి వైఎస్ విజయమ్మ నలిగిపోతున్నారు. ఆమె ఎటూ ఎవరికీ చెప్పలేక ఇద్దరినీ వదులుకోలేని స్థితిలో మనోవేదనకు గురవుతున్నారు. ఇటు కుమారుడు, అటు కుమార్తె.. ఇద్దరికీ ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంలో ఆమె తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఏ తల్లికీ ఇటువంటి కష్టం రాకూడదు. గతంలో ఏ రాజకీయ పార్టీ అగ్రనేతల కుటుంబాల్లోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. వైెఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఇద్దరూ కోరుకుంటున్నారు. అందులో తప్పులేదు. రాజకీయంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారే వైఎస్ వారసులుగా ప్రజలు గుర్తిస్తారు. వైఎస్ షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి తర్వాత ఏపీ ఎన్నికల సమయానికి జగన్ కు వ్యతిరేకంగా ఆమె జనంలోకి వెళుతున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య తలెత్తిన ఈ రాజకీయ వైరంలో మాత్రం తల్లి విజయమ్మ కన్నీటి పర్యంతమవుతున్నారని మాత్రం ఆ కుటుంబీకులకు అత్యంత దర్గర వారు చెబుతున్నారు. తెలంగాణలో అయితే విజయమ్మ షర్మిలకు నేరుగా మద్దతిచ్చారు. కానీ అదే సమయంలో ఏపీలో జగన్ కు మద్దతివ్వాల్సిన పరిస్థితి ఉంది.
ఇడుపులపాయ ఘాట్ వద్ద...
ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జాబితాను విడుదల చేసే సమయంలో ఇద్దరి చెంత విజయమ్మ ఉండటమే దీనికి కారణం. ఎవరినీ వదుకోలేను అని ఆమె సూత్రప్రాయంగా చెప్పినట్లయింది. అయితే రానున్న ఎన్నికల్లో తన తరుపున విజయమ్మను ప్రచారం చేయాలని వత్తిడి సహజంగానే వైఎస్ జగన్ నుంచి వస్తుంది. గత ఎన్నికల్లో ఆమె ఊరూరా తిరిగి తన బిడ్డను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. అయితే ఈసారి ప్రచారం చేయాలంటే మరో వైపు తన కుమార్తె షర్మిల కాంగ్రెస్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారా? లేక ఒకవైపు మొగ్గు చూపుతారా? అన్న చర్చ మాత్రం వైఎస్ కుటుంబీకుల్లో ఉంది. ఇద్దరు తన రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే. కన్నపేగులే. కానీ మమకారాన్ని పంచడమంటే సరే కానీ.. ఒకరికే ఇవ్వాలనడం ఏ తల్లికైనా ఎలా సాధ్యం?
ఏ జెండాను పట్టుకోవాలి?
కడప పార్లమెంటు పరిధిలోని పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పోటీ చేస్తున్నారు. అదే సమయంలో కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో ఉండనున్నారు. తన భర్తకు నీడనిచ్చి.. రాజకీయంగా అండగా నిలిచిన కడప ప్రజలను ఎవరికి మద్దతివ్వాలని విజయమ్మ కోరాలి? అందుకే ఈసారి ఏపీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. తన కుమారుడు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆమె ఎందుకు కోరుకోదు? అదే సమయంలో కడప నుంచి షర్మిల గెలిచి పార్లమెంటులో కాలుమోపాలని కూడా భావిస్తుంది. కానీ ఇద్దరి జెండాలు వేర్వేరు కావడంతో ఆమె మాత్రం ఏ జెండాను పట్టుకోకుండా.. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయితే చాలు అన్నట్లుగానే ఉంది విజయమ్మ పరిస్థితి. మరి ఆమె నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.
Next Story