Sat Nov 23 2024 20:20:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Family : వైఎస్సార్ కుటుంబంలో ఏం జరుగుతుంది? బాధ పడుతున్న దెవరు?
వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చింది. వైఎస్అభిమానులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో కొంత ఇబ్బంది పడుతున్నారు.
వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చింది. వైఎస్ కు ఎంతమంది అభిమానులున్నారో.. వారంతా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో కొంత ఇబ్బంది పడుతున్నారు. సోదరుడు జగన్ వైసీపీ పార్టీ కాగా, సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్లుగా ఉన్నారు. ఒకే రాష్ట్రంలో ఎన్నికలను అన్నా చెల్లెళ్లు ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబం నిట్టనిలువునా చీలిపోయింది. దీంతో తల్లి విజయమ్మ ఇద్దరితో ఎవరితో ఉండాలో నిర్ణయించలేక ఆమె దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారు. కేవలం అధికారం కోసమే కాదు కానీ.. అనేక కారణాలతో కుటుంబంలో చీలిక వచ్చిందని వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికలు వైఎస్ అభిమానులకు కొంత ఇబ్బందిని తెచ్చి పెట్టాయని చెప్పాలి.
అన్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో సోదరి వైఎస్ షర్మిల ప్రయత్నిస్తుండగా, ఈ ఎన్నికలో గెలిచి వైఎస్ లెగసీ తనదేనని చెప్పాలని భావిస్తున్నారు వైఎస్ జగన్. కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో దిగారు. అదే సమయంలో వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇప్పటి వరకూ కడప పార్లమెంటులో వైఎస్ కుటుంబానికి ఓటమి అనేది లేదు. కానీ ఈసారి ఎవరు ఓడినా.. ఎవరు గెలిచినా వైఎస్ కుటుంబం ఓటమి చవి చూసిందన్న విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అన్నది ప్రజలు నిర్ణయించాల్సి వచ్చినా ప్రచారంలో కూడా బయట వారు కూడా సొంత కుటుంబ సభ్యులే విమర్శలకు దిగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆదరించిన వారే...
ప్రజలు రాజకీయంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారే వైఎస్ వారసులుగా ప్రజలు గుర్తిస్తారు. వైఎస్ షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి తర్వాత ఏపీ ఎన్నికల సమయానికి జగన్ కు వ్యతిరేకంగా ఆమె జనంలోకి వెళుతున్నారు. షర్మిల నిలకడలేని నేతగా ముద్రపడ్డారు. ఆమె చేసే విమర్శలు కూడా పెద్దగా జనంలోకి వెళ్లేలా కనిపించడం లేదు. దీంతో పాటు షర్మిలకు తన సోదరుడు జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతే అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆమెకు కూటమి అధికారంలోకి వచ్చినా అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. కడప పార్లమెంటు పరిధిలో తమకు అందుబాటులో ఉండే వారినే కోరుకుంటారు. ఒక ప్రధాన సామాజికవర్గం మాత్రం షర్మిలతో కాకుండా జగన్ వెంటే నడుస్తుందన్న టాక్ మాత్రం వినిపిస్తుంది. కడప పార్లమెంటులో భారీ మెజారిటీ సాధించాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారంటే ఏ స్థాయిలో పగలు, ప్రతీకారాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. చివరకు ఎవరిది విజయం అన్నది మాత్రం చూడాల్సి ఉంది.
Next Story