Sat Nov 16 2024 22:40:42 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : వసంతను వదులుకుని తప్పుచేశారా? వైసీపీ ప్రయోగం సక్సెస్ అయ్యేట్లు లేదుగా?
మైలవరం నియోకవర్గంలో ఈసారి వైసీపీ ప్రయోగం చేసిందనే చెప్పాలి. ఇక్కడ టీడీపీకి విజయావకాశాలున్నాయంటున్నారు
మైలవరం నియోకవర్గంలో ఈసారి వైసీపీ ప్రయోగం చేసిందనే చెప్పాలి. కమ్మ సామాజికవర్గం గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో వారి ఆధిపత్యానికి గండికొట్టాలని భావించి వైసీప అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కమ్మ సామాజికవర్గం నేతలే ఎన్నికవతూ వస్తున్నారు. ఏ పార్టీ అయినా వారికే టిక్కెట్లు కేటటాయిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలు మాత్రం టీడీపీ వైపు ఒకింత మొగ్గు చూపుతున్నాయి. ఇక మహిళలు, వృద్ధులు ఏకపక్షంగా ఓట్లు వేస్తే తప్ప ఇక్కడ వైసీపీ గెలుపు అసాధ్యమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి మరీ పోటీకి దిగడం ఆ పార్టీకి మరింత కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 లలో ఇక్కడి నుంచి గెలిచారు. 2014లో దేవినేని భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అతి సన్నిహితమైన నేతగా కూడా ఉన్నారు. అలాంటి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కన పెట్టి మరీ ఈసారి టీడీపీ వైసీపీని వీడి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చింది. దేవినేని ఉమకు అసలు టిక్కెట్ ఇవ్వలేదు. అయినా సరే దేవినేని ఉమ వసంత గెలుపు కోసం ప్రయత్నించారు. శ్రమించారు. 2026 మళ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నందిగామ జనరల్ నియోజకవర్గంగా మారుతుందని, అప్పుడు అక్కడ పోటీ చేయవచ్చని కొంత గ్యాప్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే దేవినేని ఉమకు కీలక పదవి లభించే అవకాశాలను కొట్టిపారేయలేం.
యాదవ సామాజికవర్గానికి చెందిన...
కానీ ఇదే సమయంలో వైసీపీ ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించింది. జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న నర్నాల తిరుపతి యాదవ్ ను తమ పార్టీ అభ్యర్థి గా ప్రకటించింది. ఆర్థికంగా కూడా వసంతను ఎదుర్కొనే నేత కాదు. ఇక సామాజికవర్గం పరంగా ఆనియోజకవర్గంలో గౌడ సామాజికవర్గీయులు ఎక్కువ. గతంలో జోగి రమేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయినా ఆయనకు ఇచ్చినా ఒకింత బాగుండేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కానీ జోగిరమేష్ ను పెనమలూరుకు పంపి తిరుపతి యాదవ్ ను మైలవరానికి ఎంపిక చేశారు. కానీ వసంత ముందు తట్టుకోలేక ఎన్నికలకు ముందే చేతులెత్తేశారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. వసంత కృష్ణప్రసాద్ కు నియోజకవర్గంలో పట్టు మాత్రమే కాదు మంచి పేరు కూడా ఉంది.
అన్ని రకాలుగా...
దీంతో ఈసారి వైసీపీ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యేటట్లు కనిపించడం లేదు. టీడీపీ నేతలు సమిష్టిగా పనిచేయడంతో పాటు వైసీపీ అభ్యర్థి అన్నింటా కొంత వెనకబడి ఉండటంతో టీడీపీ ఈ నియోజకవర్గంలో గట్టి హోప్స్ పెట్టుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ కూడా తాను రెండోసారి గెలవడం ఖాయమని పూర్తి విశ్వాసంతో చెబుతున్నారు. వసంతను వదులుకుని అనవసరంగా తప్పు చేశారా? అన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. కానీ వైసీపీ కూడా ఇక్కడ గెలుపు పై ధీమాగానే కనిపిస్తుంది. మహిళలు, వృద్ధుల ఓట్లు తమకే పడతాయని, పథకాలు పొందిన వాళ్లు ఫ్యాన్ గుర్తుపైనే బటన్ నొక్కుతారన్న విశ్వాసంతో ఆ పార్టీ నేతలు కనిపిస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే మాత్రం మైలవరంలో ఫ్యాన్ గాలి అంతగా లేదన్న విశ్లేషణలు ఆ పార్టీ నాయకత్వానికే అందినట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story