Sun Dec 22 2024 21:39:54 GMT+0000 (Coordinated Universal Time)
2024 వార్: చింతమనేనికి చావో.. రేవో.. గెలిస్తే బాబు ఇచ్చిన ఆ పెద్ద పదవి హామీ ఏంటి ?
దెందులూరులో ఈసారి టగ్ ఆఫ్ వార్ జరగనుంది. చింతమనేని ప్రభాకర్, అబ్బయ్య చౌదరిల మధ్య పోటీ తీవ్రంగా ఉంది
చింతమనేని ప్రభాకర్ ఈ పేరు చెబితే తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా చాలా సింపుల్‌గా గుర్తుపట్టేస్తారు. ప్రభాకర్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన దూకుడుగా రాజకీయం చేసినా.. మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదంటారు. ఈ దూకుడు మనస్తత్వమే ప్రభాకర్‌ను ఎంతోమందికి దగ్గర చేసింది. ఎంతో మందికి హీరోను చేసింది. అలాగే కొందరికి దూరం చేసింది కూడా. ఆయనను రాజకీయాల్లో తిరుగులేని మాస్ లీడర్‌ను చేసింది. అదే ఆయనకు మైనస్ గా మారింది. స్వగ్రామం దుగ్గిరాల ఎంపీీటీసీగా కెరీర్ ప్రారంభించి.. పెదవేగి ఎంపీపీగా ఆ తర్వాత టీడీపీ నుంచి రెండుసార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు తీసుకువెళ్లింది.
ఈ క్రమంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభాకర్‌కు విప్ పదవి కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఒక రేంజ్ లో అభివృద్ధి చేసిన ప్రభాకర్.. అంతే రేంజ్ లో వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంతో చింతమనేనిపై బాగా వ్యతిరేకత ఎక్కువైంది. దీన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ బాగా వాడుకుంది. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో చింతమనేని కచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొడతారు అనుకుంటున్న టైంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో చింతమనేనికి భంగపాటు తప్పలేదు. ఊహించని పరాజయానికి చింతమనేని ప్రభాకర్ చాలా కాలం తేరుకోలేకపోయారు. ఓటమిని ఆయన జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది.
2024లోనూ అదే ప్రత్యర్థులు...
ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరు ప్రత్యర్థులే తలపడుతున్నారు. ఈసారి దెందులూరు ఓటరు ఎవరికి పట్టం కడతారు.. చింతమనేని గత ఎన్నికలలో ఓటమికి అబ్బాయ్య చౌదరిని ఓడించి రివేంజ్ తీర్చుకుంటారా ? లేదా అబ్బయ్య మరోసారి తన ఆధిపత్యం నిలుపుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. దెందులూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఈసారి హోరా హోరీ పోరు తప్పేలా లేదు. గత ఎన్నికల్లో గెలిచిన అబ్బయ్య చౌదరి ఈసారి అంత సులువుగా గెలిచే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో చింతమనేని పట్ల చాలా సానుభూతి కనిపిస్తోంది. అదే సమయంలో అబ్బయ్య చౌదరికి జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అండగా నిలిచే అవకాశముంది. ఇద్దరికీ ప్లస్ లున్నాయి. అదే స్థాయిలో మైనస్ లు కూడా ఉన్నాయి.
చింతమనేనికి బాబు ఇచ్చే గిఫ్ట్ అదేనా?
చింతమనేనిని కేసుల్లో ఇరికించడంతో ఆయన అభిమానులతో పాటు గత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి వెంట తిరిగిన వారు కూడా ఇప్పుడు చింతమనేని విషయంలో సాఫ్ట్‌కార్నర్‌తో ఉన్నారు. ఈ సారి చింతమనేనికి సీటు ఇచ్చే విషయంలో చివరి వరకు లాగిన చంద్రబాబు ఈ సారి మంచి మెజార్టీతో గెలుస్తున్నావ్.. మంచి పదవి కూడా గిఫ్ట్‌గా ఇస్తానని ఓ మాట చెప్పారు. చంద్రబాబు చింతమనేనికి గత ప్రభుత్వంలోనే విప్ పదవి ఇచ్చారు. ఈ సారి మంచి పదవి అనడంతో అది ఏ పదవి ? అన్నది కూడా సస్పెన్స్‌గా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉండటమే కాకుండా పార్టిని కనిపెట్టుకుని, టీడీపీ జెండాను విడవకుండా మోయడంతోనే చింతమనేనిపై చంద్రబాబుకు అంతటి అభిమానమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అబ్బయ్య చౌదరి సౌమ్యుడిగా...
వైసిపి విషయానికి వస్తే అబ్బయ్య చౌదరి గత ఎన్నికలలో ఎన్నో హామీలు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించి.. దెందులూరు దశ దిశను మార్చేస్తానని చెప్పిన మాటలు అన్ని నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. అభివృద్ధిలో మాత్రం ప్రభాకర్ చేసిన దాంతో పోలిస్తే ఓ 10 - 15 శాతం కూడా చేయలేదని వైసీపీ వాళ్లే చెపుతోన్న మాట. అబ్బయ్య చౌదరి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసినా అబ్బయ్య చౌదరి అనుచరులుగా చెప్పుకునేవారు నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు తమకు ఎదురు చెప్పిన సాధారణ జనాలపై జులుం ప్రదర్శించడంతో ఆ వ్యతిరేకత అంతా పరోక్షంగా అబ్బయ్య చౌదరిపై పడనుంది. ఏది ఏమైనా ఈ సారి ప్రభాకర్‌కు గెలుపు .. ఆయన పొలిటికల్ కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్.. అయితే గెలుపోటములు మాత్రం ఇద్దరి మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో మరి.
Next Story