Mon Dec 23 2024 07:09:34 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : పూనకాలు లోడింగ్... రూరల్ లో లైను కట్టిన ఓటర్లు.. ఇంక మనకు తిరుగేలేదంటున్న ఆ పార్టీ
ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు
ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు క్యూ కట్టారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోని రూరల్ ఏరియాలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. మండుటెండను సయితం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికే ముందుకు వస్తున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా అధిక శాతం మంది క్యూ లైన్ లలో కనిపిస్తుండటంతో ఈసారి పోలింగ్ శాతం 83 శాతానాకి పెరగవచ్చన్న అంచనాల్లో ఎన్నికల కమిషన్ అధికారులున్నారు. అర్బన్ లోనూ గతంతో పోలిస్తే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు తరలి వచ్చారు.
కొత్త ఓటర్లు కూడా...
వీరితో పాటు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓటు వేయాలన్న కసితోనే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఓటు అంటే గతంలో క్యూ లైన్ గంటల తరబడి నిలబడి వేచి చూడటం వేస్ట్ అని, పనులు మానుకుని ఓటు వేసినా మనకు దక్కే ప్రయోజనం ఏమీ లేదన్న నైరాశ్యం ఓటర్లలో కనిపించేది. కానీ ఈసారి మాత్రం సీన్ అలా లేదు. ఓటు వేసి తీరాలి. మనకు దక్కాల్సిన ప్రయోజనాలను వచ్చేలా చూసుకోవాలన్న భావన ఓటర్లలో స్పష్టంగా కనపడుతుంది.
గత ఎన్నికలకు మించి...
గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈసారి దానికి మించి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. అన్ని పనులు మానుకుని మరీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. చైతన్యం వెల్లివిరిసిందా? లేక మరేదైనా కారణమా? డబ్బు ప్రభావమా? అన్నది మాత్రం తెలియనప్పటికీ పోలింగ్ శాతం పెరగడం శుభపరిణామమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ పెద్దయెత్తున నగదును పంచి పెట్టాయి. దీంతో తమకు నగదు ఇచ్చిన వారికి ఓటేయాలన్న భావనతో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో పార్టీలు ఎవరికి వారే తమకు అనుకూలంగా ఫలితాలుంటాయని అన్వయించుకుంటున్నారు.
గంటల తరబడి...
అర్బన్ ప్రాంతాల్లోనూ గతంలో కన్నా మెరుగైన పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశముంది. అయితే రూరల్ తో పోలిస్తే అర్బన్ ఏరియాలోనే అత్యధికంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అయితే సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుండటంతో మధ్యాహ్నం నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. సాయంత్రం కొంత ఎండ వేడిమి తగ్గిన తర్వాత మరింత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఉదయం నుంచి వచ్చిన ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. యువత కూడా తమ సెల్ఫోన్ లు ఇంట్లో ఉంచి పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం నిజంగా మంచి పరిణామామే. గెలుపోటములు పక్కన పెడితే.. ఓటర్లు మాత్రం బాగా కసెక్కిపోయినట్లు కనిపిస్తుంది.
Next Story