Fri Nov 22 2024 15:20:08 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ చేసిన తప్పులివే... అవే ఫ్యాన్ పార్టీ ఓటమికి కారణమయ్యాయా?
తొలి ఐదు నెలల్లోనే జగన్ పాలన అంటే ఏంటో అందరికీ అర్థమయింది
వైఎస్ జగన్ తనకు తిరుగు లేదనుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్ ఒకరకంగా ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారన్న విమర్శలున్నాయి. కేవలం ప్రజల సొమ్ముతో వారినే తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. తొలి ఐదు నెలల్లోనే జగన్ పాలన అంటే ఏంటో అందరికీ అర్థమయింది. కేవలం నగదు పంపిణీ పేరుతో సంక్షేమ పథకాల బూచిని చూపి రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించారు. అంతే తప్ప అభివృద్ధిపై ఆయన నాలుగేళ్ల పాటు ఏమీ చేయలేదు. అంటే ఐదేళ్లలో రెండేళ్లు కరోనాతో ిఇబ్బంది పడినప్పటికీ మూడేళ్లలో ఆయన చేయగలిగిన డెవలెప్ మెంట్ చేయలేదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అయితే వైసీపీ కేసుల ధాటికి భయపడి ఎవరూ ముందుకు రాలేదన్నది కూడా అంతే యదార్థం.
అధికారంలోకి వచ్చీ రావడంతోనే చంద్రబాబు నిర్మించిన ప్రజా వేదిక ను కూల్చి వేయడంతో మొదలు పెట్టి ఇక వెనక్కు తిరిగి చూడలేదు. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా బలహీనం చేయడానికే ఆయన ఎక్కువ సమయాన్ని వినియోగించాడు. ఇక ప్రతిపక్ష నేతలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వరస కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. చివరకు సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజును కూడా వదలలేదు. అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత ఉపశమనం పొందాల్సి వచ్చింది. మద్యం షాపులను ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని ఒక సామాజికవర్గం ఆర్ధిక మూలాలను దెబ్బతీయగలిగాడు. అలాగే మూడు రాజధానుల అంశాన్ని బయటకు తీసుకు వచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి అదే సామాజికవర్గాన్ని ఆర్థికంగా నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఈ అడుగులో రెడ్లు, కాపులు వంటి వాళ్లు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.
రెడ్లలో అసంతృప్తి...
ఇక తన సొంత సామాజికవర్గాన్ని కూడా జగన్ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నినాదం అందుకుని సొంత సామాజికవర్గమైన రెడ్లలోనూ అసంతృప్తిని కొని తెచ్చుకున్నాడు. 2019 ఎన్నికల్లో తమ ఆస్తులను అమ్ముకుని జగన్ ను గెలిపించడం కోసం పనిచేసిన వారు సయితం ఈప్రభుత్వంలో ఎలాంటి పదవులు, కాంట్రాక్టర్లు రాకపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆ సామాజికవర్గం కూడా చాలా వరకూ అసంతృప్తికి గురయింది. ప్రధానంగా గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కోసం పనిగట్టుకుని తమ ఆస్తులను పణంగా పెట్టిన రెడ్లు ఈసారి జగన్ కు ఓటేసి మనం సాధించిందేమిటి? అన్న ప్రశ్న తమలో తాము వేసుకుని దూరంగా ఉన్నారు. దూరంగా ఉండటంతో పాటు తాము ప్రభావం చూపే ఓటర్లను కూటమి వైపునకు డైవర్ట్ చేశారు. అది కూడా జగన్ కు దెబ్బే.
క్యాడర్ ను పక్కన పెట్టి...
ఇక జగన్ అంటే పిచ్చిగా ఉన్న క్యాడర్ ను ముఖ్యమంత్రి అయిన తర్వాత అస్సలు పట్టించుకోలేదు. చొక్కాలు చించుకుని తాము గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అప్పటి అధికార పార్టీ నేతలతో తలపడి.. తలలు పగలు కొట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి క్యాడర్ ను నీరుగార్చారు. గ్రామాల్లో సయితం జెండా పట్టుకున్న వారిని లెక్క చేయని పరిస్థితికి తెచ్చిన జగన్ స్వయంకృతం కారణంగానే ఈసారి క్యాడర్ పోలింగ్ కేంద్రాల వద్ద బలంగా నిలబడలేదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏ రాజకీయ పార్టీకైనా క్యాడర్ బలంగా ఉండాలి. దానిని విస్మరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నది 2024 పోలింగ్ సందర్భంగా జగన్ కు అర్థమయి ఉంటుంది. అయితే అప్పటికే ఆలస్యమయింది. ఎంత నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.
Next Story