Mon Dec 23 2024 13:52:15 GMT+0000 (Coordinated Universal Time)
YS Jagan : బస్సు యాత్ర మరో సారి అధికారాన్ని అందిస్తుందా? జగన్ ను జనానికి దగ్గర చేస్తుందా?
వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరుతున్నారు
వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఈ సభలను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వైఎస్ జగన్ యాత్ర సాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఏకబిగిన ఆయన యాత్రకు సిద్ధమయ్యారు. మొత్తం 21 రోజుల పాటు జగన్ నిర్విరామంగా బస్సు యాత్రలో పాల్గొననున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంటు స్థానాలు మినహాయించి మిగిలిన 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన యాత్ర సాగనుంది.
బయటకు రాకుండా...
నిజానికి 2019లో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత వెంటనే కరోనా వచ్చింది. దాదాపు ఏడాదిన్నర కరోనా తో సరిపోయింది. తర్వాత కూడా ఆయన పెద్దగా జనంలోకి రాలేదు. నియోజకవర్గాల్లో సభలు పెట్టి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయడానికి మాత్రమే ఆయన వచ్చే వారు. నెలలో అప్పుడప్పుడూ అదీ లబ్దిదారులకు నిధులు విడుదల చేయాల్సిన సమయంలోనే ఆయన బయటకు వచ్చారు. మిగిలిన సమయమంతా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఎక్కువ సేపు గడిపారన్న విమర్శలున్నాయి. కనీసం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ.
ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి జనంలోకి వస్తున్నారని అనుకోవచ్చు. అదీ ఎన్నికల సమయంలో. సంక్షేమ కార్యక్రమాలే తనను తిరిగి గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. తాను ఐదేళ్లుగా ప్రత్యేకంగా సృష్టించుకున్న ఓటు బ్యాంకు తనను అందలం ఎక్కిస్తుందన్న ఆశతో జగన్ ఉన్నారన్నది వాస్తవం. గత ఎన్నికల తరహాాలోనే ఈసారి కూడా తన బొమ్మతోటే ఆయన ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సర్వేల్లో వారికి మైనస్ మార్కులు వచ్చాయని చెప్పి పక్కన పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆర్థికంగా, సామజికవర్గం పరంగా బలమైన నేతలను కూడా వదులుకునేందుకు సిద్ధపడ్డారంటే ఆయనలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాను ప్రజలను నమ్ముకున్నానని, నేతలను కాదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం?
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేశారన్న అపవాదు ఉంది. సొంత జిల్లాలో వైఎస్ వివేకా హత్య కూడా ఒకింత ప్రభావం చూపనుంది. పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలున్నాయి. పరిశ్రమలు పెద్దగా రాలేదని, ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్న విమర్శలకు కూడా ఆయన ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సిన పని ఉంది. సంక్షేమంలో నెంబర్ వన్ అయితే.. అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి పడిపోవడానికి కారణాలను కూడా ప్రజలకు వివరించాలంటున్నాయి విపక్షాలు. ఇన్ని సవాళ్ల మధ్య జగన్ బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం అంటూ వస్తున్న జగన్ కు తామూ సిద్ధమని జనం భావిస్తారా? జగన్ ను జనం యాత్రతో మరోసారి ఆదరిస్తారా? లేక పరిపాలన బాగాలేదని పెదవి విరుస్తూ పక్కన పెడతారా? అన్నది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తేలనుంది.
Next Story