Sat Dec 21 2024 08:28:24 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే
సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నాయుడు మరోసారి మీ ముందుకు వస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నాయుడు మరోసారి మీ ముందుకు వస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చోడవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టడమేనంటూ వ్యాఖ్యానించారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే వృధా అయినట్లుగా చంద్రబాబు కు ఓటేస్తే గోవిందా.. గోవిందా.. అనాల్సిందే. తిరుమలలో ఏడుకొండల వాడికి చెప్పే గోవిందనామము కాదని, చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో చెప్పే గోవిందా అంటూ జగన్ చోడవరం సభలో అన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమిటి గోవిందా చేశారో తెలుసుకుందామా? అంటూ ప్రశ్నించారు.
బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని...
2014 ఎన్నికల మ్యానిఫేస్టోలో ముఖ్యమైన హామీలంటూ ఇంటింటికీ తాను స్వయంగా సంతకాలు పెట్టి పంపించారన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. అది చేయలేదు. డ్వాక్రారుణాలన్నింటినీ రద్దు చేస్తానన్నాడు. కానీ రద్దు చేయకుండానే పాలన ముగించాడని.. గోవిందా.. గోవిందా అంటూ వెళ్లి పోయాడన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ నమ్మించి చివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టిన చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రెండు వేలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశాడని, అది కూడా గోవిందా.. గోవిందా.. అంటూ ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు రావాలన్నాడు. ఈ మాటలను నమ్మి చంద్రబాబును గెలిపిస్తే తర్వాత అందరికీ గోవిందా.. గోవిందా.. పెట్టేశాడన్నారు.
హైదరాబాద్ ను వదిలేసి...
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ ను వదలి ఇక్కడకు వచ్చాడన్నారు. ప్రత్యేక హోదా ఏమైంది? గోవిందా.. గోవిందా అంటూ ప్యాకేజీ అంటూ జై కొట్టాడన్నారు. విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పి గోవిందా చెప్పేశాడు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ అంటూ అందరిని నమ్మించిన చంద్రబాబు చివరాఖరకు గోవిందా అనేశాడన్నారు. నాడు ముఖ్యమైన హామీలను అమలు చేయని చంద్రబాబు ఈరోజు చెప్పే వాగ్దానాలను నమ్ముతారా? అంటూ జగన్ ప్రశ్నించారు. ఈ పెద్దమనిషిని నమ్మొచ్చా అని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అని, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ వస్తున్నాడని, నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే అవుతుందని అన్నారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా.. బాబు కుర్చీ ఎక్కితే.. రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా.. బాబు మాటలు నమ్మితే గోవిందా.. గోవిందా అంటూ జగన్ చోడవరం సభలో అన్నారు.
Next Story