Tue Dec 24 2024 02:32:15 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఆ నియోజకవర్గాలపైనే ఆశలు... ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామంటున్న వైసీపీ
గత ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో తాము అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అన్న విశ్వాసంతో వైసీపీ నేతలున్నారు
గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను ఈసారి కూడా నిలబెట్టుకుంటామని, అదనంగా మరికొన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ హైకమాండ్ లెక్కలుగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో తాము అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అన్న విశ్వాసంతో వైసీపీ నేతలున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 29 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. ఏడు ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. రిజర్వ్డ్ నియోజకవర్గాలైన వీటిలో గత ఎన్నికల్లో కేవలం రెండింటిలో మాత్రమే వైసీపీ ఓటమి పాలయింది. ఈసారి ఆ స్థానాలను కూడా గెలుచుకుని తమ సంఖ్యను మరింత పెంచుకుంటామన్న ధీమాతో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు.
గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన కొండపి నుంచి టీడీపీ విజయం సాధించగా, రాజోలు నుంచి జనసేన విజయం సాధించింది. మిగిలిన 27 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఏడింటినీ కూడా ఫ్యాన్ పార్టీ సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఈ ఏడు స్థానాలు తమవేనన్న ధీమా ఆ పార్టీనేతల్లో కనిపిస్తుంది. బలమైన నాయకత్వం ఉండటంతో పాటు విపక్ష పార్టీలు తీసుున్న నిర్ణయాలు తమను గెలుపు తీరాలను చేరుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అయితే టీడీపీ కూడా ఈసారి గతంతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో తమది పై చేయి కాకపోయినా గత ఎన్నికలకంటే అధిక స్థానాలను సాధిస్తామని చెబుతుంది. అందుకు కారణాలను కూడా ఆ పార్టీ చెబుతుంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వెయిట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ అయితే వైసీపీకే ఈ స్థానాల్లో ఎక్కువ విజయావకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మార్చడంతో...
రిజర్వ్డ్ నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలనే ఈసారి జగన్ దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. అభ్యర్థులను అటు ఇటు మార్చింది ఎక్కువగా ఎక్కడ అంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలనే చెప్పాలి. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు స్థానిక వైసీపీ నేతలతో పొసగకపోవడంతో పాటు అసంతృప్తులు ఎక్కువగా వినిపించాయి. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జులతో నేరుగా తలపడంతో పాటు తమను లెక్కచేయలేదని పదే పదే హైకమాండ్ కు ఫిర్యాదులందాయి. అనేక సార్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. తగ్గనంటే తగ్గకపోవడంతో చివరకు వారిని మార్చక తప్పింది కాదు. కొందరు మంత్రులను సయితం నియోజకవర్గాలను మార్చారు. ఇలా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలన్న వ్యూహాన్ని జగన్ టిక్కెట్ కేటాయింపు నుంచే అమలు చేశారు.
ప్లాన్ వర్క్ అవుట్ అయి...
అయితే జగన్ ప్లాన్ వర్క్ అవుట్ అయినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులు పాత వారికే ఎక్కువ టిక్కెట్లు కేటాయించడంతో పాటు అక్కడ పార్టీనేతల మధ్య కుమ్ములాటలు తమకు అభ్యర్థి మార్పుతో కలసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతా తమకు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సానుకూలత కనపడిందని అందిన నివేదికలు చెబుతున్నాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగానే ఈసారి అత్యధికంగా అంటే ఆల్ మోస్ట్ అన్నీ సీట్లను తాము కైవసం చేసుకుంటామని ఆత్మవిశ్వాసంతో వైసీపీ నేతలున్నారు. దీనికి తోడు జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా తమకు కలసి వచ్చేదిగా ఉండటంతో ఈసారి ఆ నియోజకవర్గాలన్నీ తమ ఖాతాలో పడినట్లేనని చెబుతున్నారు. మరి జూన్ 4వ తేదీన తర్వాత గాని దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
Next Story