Fri Nov 22 2024 08:37:16 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : బబుల్ మధ్యలో జగన్ .. అందుకే పార్టీ ఖర్మ కాలిందిలా
వైసీపీ హిస్టరీలోనే అతి స్వల్ప సీట్లు ఆ పార్టీకి రావడానికి జగన్ స్వయంకృతాపరాధమే కారణం.
వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయింది. పార్టీ హిస్టరీలోనే అతి స్వల్ప సీట్లు ఆ పార్టీకి రావడానికి జగన్ స్వయంకృతాపరాధమే కారణం. ఆయన ఒక బబుల్ లో ఉండిపోయారు. ఆయన ఎవరినీ కలవరు.. ఎవరినీ నమ్మరు... తనకు అందిన వార్తలే నిజమని నమ్మారు. అదే ఫ్యాన్ పార్టీ కొంపముంచిందని ఇప్పుడు నేతలు వాపోతున్నారు. జగన్ ను కలిసేందుకు కూడా వీలులేని పరిస్థితులు ఆయనకు ఆయనే కల్పించుకున్నారు. ఇందులో యాభై శాతం తప్పిదం వైసీపీ అధినేత వైఎస్ జగన్ దే. మిగిలిన యాభై శాతం మాత్రం చుట్టూ ఉన్న అధికారులు, నేతలదేనని చెప్పాలి. ఎందుకంటే జగన్ వారి మాటలే నమ్మి చివరకు నిండా మునిగారు.
కోటరీ ప్రధాన కారణం..
సరే.. ఓటమి పాలయిన తర్వాత విమర్శలు సహజమే అయినప్పటికీ కొన్ని రోజులు భరించాల్సి ఉంటుంది. వాస్తవాలను ఇప్పటికైనా తెలుసుకుని నేల మీదకు దిగివస్తే భవిష్యత్ ఉంటుంది. జగన్ ఓటమికి ప్రధాన కారణాలలో ఆయన మొండితనం ఒక కారణమయితే..మరొకటి చుట్టూ ఉన్న కోటరీ. అందులో ఇటీవలే పదవీ విరమణ చేసిన ధనుంజయ్ రెడ్డి. ఆయన అంతా తానే అయి వ్యవహరించారు. జగన్ ఏం చేయాలో ఆయనే చెబుతారు. జగన్ ను ఎవరు కలవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఎవరికి టిక్కెట్ దక్కాలన్నా ధనుంజయ్ రెడ్డి ఆశీస్సులు పొందాల్సిందే. అందుకోసం సీనియర్ నేతలు సయితం ధనుంజయ్ రెడ్డి ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు.
అనుమతి లేనిదే...
ధనుంజయ్ రెడ్డి అనుమతి లేనిదే జగన్ ను ఎవరూ కలవలేని పరిస్థితి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉంది. చివరకు ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారిని కూడా ధనుంజయ్ రెడ్డి టీం బుజ్జగింపులు జరిపిందంటే ఆయన ప్రభావం జగన్ వద్ద ఎంత మేరకు పనిచేసిందో చెప్పవచ్చు. ఇక ఓటమి తర్వాత ధనుంజయ్ రెడ్డి పార్టీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కూడా జగన్ ని కలిసే పరిస్థితి ఉండేది కాదని జక్కంపూడి రాజా బహిరంగంగా విమర్శించారంటే ఆయనపై ఎంత ఆగ్రహం నేతల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సజ్జల పాత్రను...
ధనుంజయ్ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అదే రకమైన పాత్రను పోషించారనే విమర్శలు పార్టీలో గుప్పుమంటున్నాయి. అంతా ఆయనే అయి వ్యవహరించారు. జగన్ ఆదేశాలను అమలు చేస్తారని బయటకు చెబుతున్నా.. జగన్ కు తప్పుడు సమాచారం అందించడంలో సజ్జల ముందుంటారని చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో విభేదాలు నేతల మధ్య ముదురుతున్నా వాటిని పరిష్కరించకుండా ఒకరి వైపు కొమ్ము కాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమికి జగన్ ఎంత కారణమో సజ్జల కూడా అంతే కారణమన్న వ్యాఖ్యలు పార్టీనేతలు చెబుతున్నారు. అన్ని శాఖల్లో జోక్యంచేసుకుంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో గుప్పు మంటున్నా ఇప్పుడు ఓటమి తర్వాత అవి మరింత బహిర్గతమవుతున్నాయి. మొత్తం మీద జగన్ ఓటమికి వీళ్లిద్దరూ ప్రధాన కారణాలుగా నేతలు నేరుగా చెబుతుండటం విశేషం.
Next Story