Thu Dec 19 2024 16:43:56 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యకు ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందేనా... దారులన్నీ ఇక అటువైపేనా?
అయోధ్యకు వచ్చిన ప్రాచుర్యం మరే ఆలయానికి రాలేదు. ఇటీవల కాలంలో ఇంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా పేరు తెచ్చుకుంది
ఇప్పుడు దేశం చూపంతా అయోధ్య వైపే.. ఒక్కసారి అయోధ్యకు వెళ్లి వస్తే చాలు అన్నంత రీతిలో దేశ ప్రజల హృదయ స్పందన ఉంది. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్లు గతంలో మరణించేలోపు ఒకసారి కాశీకి వెళ్లి వస్తే చాలని భావించే వారు. ఇప్పుడు ఆ జాబితాలో అయోధ్య చోటు చేసుకుంది. దేశంలోనే అతి పెద్ద మూడో ఆలయంగా ప్రసిద్ధిగాంచిన అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని చూసి, ఆయన జన్మించిన గడ్డపై కాలు పెట్టి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆయనను దర్శించుకుని వస్తే జన్మ ధన్యమయినట్లేనని భావన ప్రజల్లో కలుగుతుంది.
ప్రచారం కూడా అదే స్థాయిలో...
అయోధ్యలో రామాలయంలో ప్రారంభానికి ముందే ప్రపంచ వ్యాప్తంగా ఆ స్థాయిలో ప్రచారం లభించింది. మరే ఇతర దేవుళ్లకు రాని క్యాంపెయినింగ్ అయోధ్య రాములోరి విషయంలో నడుస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో వీధిలో రామాలయం ఉండటమనేది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నదే. హిందువుల మనసులో రాముడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆయన చూపిన బాట అందరికీ ఆదర్శం కావడమే. ఆయనను అనుసరిస్తే చాలు జీవితం ధన్యమయినట్లేనని భావిస్తారు.
రామజన్మభూమిలో...
తండ్రి మాట కోసం పథ్నాలుగు ఏళ్లు వనవాసం చేయడం, ఆడిన మాట తప్పకపోవడం, రాజ్యాన్ని పాలించడం వంటి వాటితో రాముడు ఆరాధ్య దేముడుయ్యారు. ఆయనే ఆదర్శమయ్యారు. అందుకే రామరాజ్యం అంటూ ప్రతి ఒక్కరూ నినదిస్తారు. అలాంటి రాముడు జన్మించిన భూమిలో తాము ఒక అడుగేసి పునీతులం కావాలని ఎవరు అనుకోరు. అందుకే అయోధ్య ఆలయ ట్రస్ట్ కూడా అదే రకమైన వసతులు కల్పిస్తుంది. సౌకర్యాలను ప్రజలకు అనుకూలంగా మార్చడంలో ఇప్పటికే సక్సెస్ అయింది. త్రేతాయుగం నాటి రాముడు నడయాడిన గడ్డను చూసివద్దామని భావించేవారు కోట్లలోనే ఉంటారు. దీంతో పాటు మరో మూడు రోజులలో రాముడి ప్రాణప్రతిష్ట జరగనుండటంతో ఆ ఘడియల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
నిత్య పూజలు చూసేందుకు...
దీంతో అయోధ్యకు రాలేని వారికి నిత్య పూజలు, అయోధ్య విశేషాలను చూసేందుకు అయోధ్య ఆలయ ట్రస్ట్ త్వరలోనే ప్రత్యేక ఛానల్ ను తీసుకు వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తుంది. టీటీడీ ఛానల్ తరహాలోనే 24 గంటలూ అయోధ్య గురించి చెప్పే విశేషాలను ఆ ఛానల్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రసారం చేయనున్నారు. దేవాలయంలో జరిగే సేవలతో పాు ఉత్సవాలను, అక్కడి సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ ఛానల్ వీలు కల్పించేలా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ ఛానెల్ ఎప్పుడు వస్తుందన్నది ఇంకా తెలియకున్నా, అతి త్వరలోనే దీనిని తెస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు చెబుతుండటం విశేషం.
Next Story