Sun Dec 22 2024 17:47:00 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్య పిలుస్తుంది .. దేశం మొత్తం రామయ్య కోసమే
అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఇక గంటలే సమయం ఉంది. ప్రధాని మోదీ మరికాసేపట్లో అయోధ్యకు రానున్నారు
అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఇక గంటలే సమయం ఉంది. రామజన్మభూమిలో నేడు జరగనున్న ఈ వేడుకలను అత్యంత వైభవంగా చేస్తున్నారు. దేశం మొత్తం చూపు అయోధ్య వైపు చూస్తుంది. అయితే ఈరోజు రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యకు రానున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఆయన రాముడి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనేందుకు పదకొండు రోజుల నుంచి అనుష్టానం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
పదకొండు రోజులుగా...
హిందూ ధర్మాచారం ప్రకారం ప్రాణప్రతిష్ట చేసేవాళ్లు అనుష్టానం చేయాల్సి ఉంటుంది. ఆయన దానిని తుచ తప్పకుండా ఆచరిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన ఉపవాసదీక్ష అనుసరిస్తున్నారు. నేలపైనే నిద్రిస్తున్నారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ ఆధ్మాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొబ్బరి నీళ్లనే ఆహారంగా తీసుకుంటూ వస్తున్న మోదీ నేడు అయోధ్యకు చేరుకుని బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే అనేక మంది రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకున్నారు. దేశంలో ఉన్న సన్యాసులు దాదాపు ఎక్కువ శాతం అయోధ్యలోనే గత కొన్ని రోజుల నుంచి ఉంటున్నారు. ఈ శుభఘడియల కోసం నిరీక్షిస్తున్నారు.
మోదీ షెడ్యూల్ ఇదే...
ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ 10.25 గంటలకు అయోధ్యలోని వాల్మీకీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.55 గంటలకు రామాలయానికి చేరుకుంటారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయం మొత్తం కలియ తిరుగుతారు. ఆలయాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలు ప్రాణప్రతిష్ట పూజా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 12.55 గంటల వరకూ సాగనుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బహిరగం సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ భక్తులతో గడుపుతారు. తర్వాత కుబేర్ తాలా ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.
Next Story