Sun Dec 22 2024 12:29:20 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : నిరీక్షణ ఫలించింది.. కన్నుల పండువగా సాగిన క్రతువు
అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రాముడిని వివిధ మాధ్యమాల్లో చూడగలిగారు
అయోధ్యలో రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తియింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రాముడిని వివిధ మాధ్యమాల్లో చూడగలిగారు. అయోధ్య రామయ్య కనిపించిన దృశ్యాలు కట్టిపడేశాయి. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బిగ్ స్క్రీన్ లు వేసుకుని ఈ వేడుకను చూశారంటే రామయ్యా.. మజాకా.. అనిపించేంత రీతిలో ఈ మహత్తర వేడుక జరిగిందనే చెప్పాలి. లక్షలు కాదు.. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే రాముడిని నేడు తొలిసారి తిలకించి పునీతులయ్యామని ప్రజలు సంబరపడిపోతున్నారు.
దేశమంతా...
దేశమంతా పండగ వాతావరణం. ఊరు లేదు.. వాడ లేదు.. నగరం లేదు.. ఎక్కడ చూసినా రాములోరి సందడే. ఎక్కడ విన్నా ఆయన నామ స్మరణమే. అందుకే భారతదేశంలో రాములు వారికి అంత ప్రాధాన్యత. ప్రతి వీధిలో ఒక రాములోరి గుడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. నిత్య పూజలు నిర్వహిస్తారు. నిత్య పారాయణం చేస్తారు. రామ భజనలతోనే గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. నవమి వేడుకలు వచ్చాయంటే ఇక చెప్పాల్సిన పనిలేదు.
పండగ మాదిరి...
ఈరోజు అందరూ పండగలాగే ఈ వేడుకను దేశ వ్యాప్తంగా జరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ బాాలరాముడి దర్శనం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నేడు ఆ కల సాకారమయింది. కళ్లముందు అయోధ్య రాముడు కనిపించాడు. ఇది చాలదూ.. ఈ జన్మకంటూ పెద్దవారు రామపారాయణం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయాల్లోనే కాకుండా ఇంట్లోనూ రామభక్తి ఈరోజు ఎంతలా కనపడిందంటే దాదాపు నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటం కోసం అందరూ పడిగాపులు కాశారు. నేడు ఫలించింది.
Next Story