Sun Dec 22 2024 11:57:37 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : మోదీ ఎందుకు అలా భావోద్వేగానికి గురయ్యారంటే?
అయోధ్యలో రాముడు ఇక టెంట్ లో ఉండరని, ఆలయంలో ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అయోధ్యలో రాముడు ఇక టెంట్ లో ఉండరని, ఆలయంలో ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆలయ నిర్మాణంలో ఆలస్యమయినందుకు రాముడు క్షమించాలని కోరారు. అయోధ్యలో రామమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమని మోదీ అన్నారు. టెంట్ లో కాకుండా దివ్యమైన భవ్య మందిరంలో ఉండనున్నారని అన్నారు.
వందల ఏళ్ల నాటి కల....
ఎందరో ఎదురు చూస్తున్న ఐదు వందల సంవత్సరాల నాటి కల ఫలించిందన్నారు. అయోధ్యనగరానికి మాత్రమే కాదు సరయు నదికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారన్న మోదీ ఎన్నో త్యాగాల ద్వారా దీనిని సాధించుకోగలిగామని చెప్పారు. ఎన్నో బలిదానాలు జరిగాయన్నారు. రాముడు కొలువైన చోట ఆంజనేయుడు ఉంటారని అన్న మోదీ ఈ అమృత ఘడియల్లో తాను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పదకొండు రోజులు దీక్ష చేసి ఈ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నానని చెప్పారు.
కొత్త కాలచక్రానికి...
ఈరోజు కొత్త కాలచక్రానికి నాందిగా నిలుస్తుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి మంచి పనికీ ఎదురుదెబ్బలు తగలడం సహజమేనని, అయితే చివరకు న్యాయం గెలుస్తుందని చెప్పడానికి ఈ ఆలయ నిర్మాణమే ఉదాహరణ అని మోదీ అన్నారు. తన మనసంతా బాల రాముడి రూపంపైనే ఉందన్న మోదీ, కొన్ని వందల నాటి ఏళ్ల నిరీక్షణ ఫలించిందని చెప్పారు. ఇప్పుడు అయోధ్యలో రాముడు వెలిసిన రోజున వెయ్యేళ్ల భారతావనికి పునాది వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాముడు శక్తి కాదని, కాత్త శకానికి నాంది అని, రాముడు వివాదం కాదని, సమాధానం అని తెలిపారు. దేశ ప్రజలందరూ ఇక బాలరాముడిని అయోధ్యలో దర్శించుకోవచ్చని ఆయన అన్నారు.
Next Story