Mon Dec 23 2024 16:29:49 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రెయిన్ ఎఫెక్ట్... హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలు నష్టం
హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది.
హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల మేరకు వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రజలు ఎవరూ దుకాణాలకు, మాల్స్ కు రాకపోతుండటంతో అవి వెలవెల పోతున్నాయి. కొనుగోలు దారులు లేక షాపుల్లోని సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో రోజుకు దాదాపు యాభై నుంచి వంద కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరుగుతుందని మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.
హోల్ సేల్ మార్కెట్ లు...
ఇక ఆదివారమయితే మరింత రద్దీ పెరిగి మాల్స్ తో పాటు, వస్త్ర దుకాణాలు, షూ షాపులు, సినిమా హాళ్లు ఇలా కిటకిటలాడుతుంటాయి. ఇక బేగంబజార్, సికింద్రబాద్ వంటి ప్రాంతాల్లో అయితే వందల కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. హోల్ సేల్ మార్కెట్ కావడంతో అక్కడకు వచ్చిన ఇతర ప్రాంతాల ప్రజలు, ఇతర ప్రాంతాల్లో చిరు వ్యాపారులు సామాన్లను కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. కానీ భారీ వర్షాలకు రోడ్లపైకి నీరు చేరడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఈ వ్యాపారాలన్నీ దాదాపు బంద్ అయ్యాయి.
శని, ఆదివారాలు...
శని, ఆదివారాలయితే చాలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు ఉద్యోగులు రోడ్లపైనే ఉంటారు. వీరు అనేక రకాలుగా షాపింగ్ చేస్తూ తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రెండు రోజుల పాటు వ్యాపారాలు పూర్తిగా బంద్ అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జ్యుయలరీ దుకాణాలతో పాటు అనేక షాపులు తెరిచి ఉంచినా మూతబడినట్లే. భారీ వర్షాలకు కస్టమర్లు రాకపోవడంతో యజమానులు, సిబ్బంది ఈగలు తోలుకుంటున్నారు. హోటల్స్, లాడ్జిలు కూడా ఎవరూ రాకపోవడంతో ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
చిరు వ్యాపారులు...
ఇక రవాణా వ్యవస్థ స్థంభించి పోవడం, మరో రెండు రోజుల పాటు రెయిన్ అలెర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించడంతో హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య కూడా భారీగా తగ్గింది. సాధారణంగా హైదరాబాద్ కు లక్షల్లో ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వీకెండ్ లో హైదరాబాద్ కు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వర్షం దెబ్బకు పర్యాటక ప్రదేశాలు కూడా వెలవెల బోతున్నాయి. ఇక చిరు వ్యాపారుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. వారు దుకాణాలను పెట్టేందుకు కూడా ఇష్టపడటం లేదు. రైతు బజార్లకు కూడా కస్టమర్ల రాక తగ్గింది. అందరూ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుంటుండటంతో చిరు దుకాణాలపై ఈ ఎఫెక్ట్ పడిందని వాపోతున్నారు.
Next Story