Fri Nov 22 2024 09:47:30 GMT+0000 (Coordinated Universal Time)
Goutham Adani : అదానీకి వరస దెబ్బలు.. కోలుకోవడం కష్టమేనా?
అమెరికాలో కేసు నమోదు కావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పీకల్లోతు కష్టాల్లోపడినట్లే కనిపిస్తుంది
అమెరికాలో కేసు నమోదు కావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పీకల్లోతు కష్టాల్లోపడినట్లే కనిపిస్తుంది. అదానీపై అమెరికాలో లంచాలు ఇవ్వచూపిన కేసు నమోదు కావడం భారత్ లో చర్చనీయాంశమైంది. దీని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండటంతో ఇది రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. నిన్న కేసు నమోదయినట్లు తేలడంతో అదానీ గ్రూపునుకు చెందిన షేర్లు పడిపోయాయి. మదుపరులు ఆందోళన చెందుతుున్నారు. అదానీ భారతీయ అధికారులకు వేల కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై న్యూజెర్సీలోని ఫెడరల్ న్యాయస్థానంలో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
షాకిచ్చిన కెన్యా...
ఈ నేపథ్యంలో కెన్యా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కెన్యాదేశం అదానీ కంపెనీలతో కుదుర్చుకున్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇది అదానీ గ్రూపునకు కోలుకోలేని దెబ్బేనని చెప్పాలి. కెన్యా దేశంతో ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్టు ఒప్పందన్ని రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు. దీంతో అతి పెద్ద కాంట్రాక్టులన్నీ ఒక్క కేసుతో రద్దయ్యాయి. ఇది అదానీకే కాదు ఆ గ్రూపునకు చెందిన కంపెనీలకు పెద్ద షాక్ అని చెప్పాలి. అదానీ కంపెనీ పబ్లిక్ - ప్రయివేటు భాగస్వామ్యం కింద ముప్ఫయి ఏళ్లకు కెన్యా ప్రభుత్వంతో 736 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా ప్రకటించింది.
ఏపీలోనూ...
గౌతమ్ అదానీ గ్రూపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోనూ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక విద్యుత్తు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విషయంలోనూ పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందని అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్పడంతో ఒక్కసారిగా చర్చమొదలయింది. తన కంపెనీలకు చెందిన విద్యుత్తును ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే 1,750 కోట్లు ఇస్తామన్న ఆఫర్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. గౌతమ్ అదానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అదానీ యవ్వారం అమెరికా నుంచి ఏపీ వరకూ పాకిందని ఇట్టే చెప్పాలి. ఇప్పుడు అమెరికాలో నమోదయిన కేసుతో అదానీ పీకల్లోతు కష్టాల్లోపడిపోయినట్లే అనుకోవాలి. రాజకీయంగా కేంద్రంలో అధికార పార్టీకి కూడా అదానీ వ్యవహారం తలనొప్పిగా మారింది. మరి దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
Next Story