మీ వాహనంలో పోసే పెట్రోల్ మంచిదేనా? లేక కల్తీనా? బంకుల్లో చెక్ చేసుకోండిలా
భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ..
భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. వాహనదారులు పెట్రోల్ బంకుల్లో మోసపోయిన చాలా సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే బంకుల్లో రకరకాల మోసాలు జరుగుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము.
సాధారణంగా బైక్లనో, కార్లోనో పెట్రోల్, డీజిల్ వేయించుకునే సమయంలో పలు విషయాలను గమనించడం చాలా ముఖ్యం. వాటిని వానదారులు పెద్దగా పట్టించుకోరు. మీరు మీ బండిలో పోయించే పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యమైందేనా అనేది తెలుసుకోకపోతే మీ వాహనం పాడైపోయే ప్రమాదం ఉంది.
కానీ బంకుల్లో కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంకుపై లీటర్స్, పెట్రోల్ రేటు వంటి వివరాలు డిస్ప్లేలో కనిపిస్తుంటుంది. కానీ మధ్యలో DENSITY అని కనిపిస్తుంది. అంది ఎందుకు ఉంటుందని మీరెప్పుడైనా గమనించారా? డెన్సిటీ అనేది పెట్రోల్, డీజిల్‌ల నాణ్యతను తెలియజేస్తుంది. ఒక లీటరుకు డెన్సిటీ విలువ ఎంత ఉంటే అది అంత ప్రామాణికమైనదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.
దీనిని కేజీ ఫర్ మీటర్ క్యూబ్‌లో లెక్కిస్తుంటారు. పెట్రోల్‌కు అయితే 710 - 770 మధ్యలో ఉండాలి. అదే డీజిల్‌కు అయితే 820 నుంచి 860 మధ్యలో ఉండాలి. ఇందులో ఏది ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ఫ్యూయల్ క్వాలిటీ బాగా లేదని అర్థం. ఈ విలువ వివిధ పరిస్థితులను బట్టి ఒక్కో పెట్రోల్ బంకులో ఒక్కోలా ఉంటుంది. ఏ బంకులో ఎలా ఉన్నప్పటికీ డెన్సిటీ మాత్రం కేంద్రానికి లోబడి ఉండాల్సిందే. ఈ డెన్సిటీ విలువ ఎంతనేది పెట్రోల్, డీజిల్ పంపులపై డిస్ప్లే మీద మనకు కనిపిస్తుంది. ఇంధనం పరిమాణం, ధరతో పాటు డెన్సిటీ కూడా మనకు చూపిస్తుంది. ఈ విలువ అన్ని బంకుల్లో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఏ పెట్రోల్ బంకులో చూసినా 730గా కనిపిస్తోంది. డీజిల్ డెన్సిటీ విలువలో తేడా ఉన్నా, పెట్రోల్ డెన్సిటీ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. అంటే.. డెన్సిటీ విలువను ట్యాంపరింగ్ చేసినట్టేనన్నమాట. చాలా బంకుల్లో ఈ డెన్సిటీ ఆప్షనే కనిపించదు. దీనిపై అవగాహన ఉన్న వాహనదారులకే తెలుస్తుంది. చాలామందికి తెలియదు. అవగాహన ఉన్న వారు అడిగితే, పెట్రోల్ బంకు సిబ్బంది మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు.
మన దగ్గర చాలా చోట్ల బంకుల్లో ఈ వాల్యూ పెట్రోల్, డీజిల్ రెండింటికీ ఒకేలా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి.. ఈసారి మీరు పెట్రోల్, డీజిల్ పోయించేటప్పుడు దాని డెన్సిటీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకే చూసుకుని పెట్రోల్ కొట్టించుకోండి. ఒక వేళ ఎలాగున్నా సరే అనుకుంటే మీ వాహనం మైలేజి తగ్గుతుంది.. అలాగే ఇంజిన్ కూడా పాడైపోతుంది. సో.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ప్రకారం ప్రతి ఒక్క బంకు ఫాలో ఇవ్వాల్సిందే. ఏదైనా బంక్‌లో ఇది లేకపోతే ఆ బంకుకు వెళ్లకపోవడం మంచిది.
ఇంకో విషయం ఏంటంటే.. పెట్రోల్, డీజిల్ బంకులను క్రమం తప్పకుండా తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవటమే ఈ దుస్థితికి కారణం. కొంతకాలంగా తూనికల కొలతల శాఖ అధికారులు పెట్రోల్ బంకులవైపు కన్నెత్తి చూడట్లేదు. పెట్రోల్ బంకుల యజమానుల నుంచి నజరానాలు అందుకుంటున్నరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బంకుల్లో పెట్రోల్ పంపులను తూనికల కొలతల శాఖ అధికారులు నాజ్‌లు అంటారు. ఈ నాజ్లకు సంబంధించి నిర్దేశించిన సర్టిఫైడ్ రుసుమును పెట్రోల్ బంకులు చెల్లించాల్సి ఉంటుంది. బంకు యజమానులు అధికారులకు అధిక మొత్తంలో ముట్టజెప్పడం వల్ల వారు బంకులపై కన్నెత్తి చూడటం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.