Sun Dec 22 2024 20:00:19 GMT+0000 (Coordinated Universal Time)
కారు కొనాలంటున్నారా.. గుడ్ న్యూస్ డిసెంబరు నెలకు మించిన సమయం మరొకటి లేదట
కార్లను కొనుగోలు చేసే వారికి కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. వచ్చే నెల నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నయి.
కారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువుగా మారింది. కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాలనుకుంటే సొంత కారు ఉండటం తప్పనిసరి. ఇక సొంత కారు ఉంటే వీకెండ్ లోనూ, వేసవి, పండగ సెలవుల్లో లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లొచ్చు. కుటుంబమంతా కలసి ఆనందంగా జర్నీ చేయడానికి ఇప్పుడు కారు ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువుగా మారింది. అందుకే మార్కెట్ లో కార్లకు డిమాండ్ ఎప్పుడూ తగ్గడం లేదు. కొత్త జనరేషన్ నుంచి పాత తరం వరకూ కార్లను కొనుగోలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఆటోలకు, క్యాబ్ లకు పెట్టే డబ్బులతో సొంత కారుతో పనులు ముగించుకోవచ్చని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందులో నగరాల్లో ఇది అవసరమైన వస్తువుగా మారింది.
వాయిదా పద్ధతుందిగా...
దీంతో పాటు కారు కొనుగోలు చేయాలంటే మొత్తం ఒక్కసారి నగదును చెల్లించాల్సిన పనిలేదు. నెల వాయిదాలతో చెల్లించవచ్చు. బ్యాంకులు కూడా తక్కువ వడ్డీలకు కారు కొనుగోలు కోసం రుణాలను అందచేస్తుంటడంతో కార్లకు గిరాకీ పెరిగింది. యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే చాలు ఎంచక్కా కారును తీసుకుని ఇంటికి వెళ్లవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబరు నెల వచ్చిందంటే కార్ల ధరలు తగ్గుతాయి. కంపెనీలతో నిమిత్తం లేకుండా ధరలు ఆటోమేటిక్ గా తగ్గిస్తాయి. ఎందుకంటే ఏడాది మారుతుంది కాబట్టి మోడల్ ఛేంజ్ అవుతుందని భావించి కార్లకు పెద్దగా రీ సేల్ వాల్యూ ఉండదు. అందుకే కార్ల కంపెనీలు తామే ధరలను తగ్గించి డిసెంబరు నెలలో సూపర్ సేల్ ను నిర్వహిస్తుంటాయి.
వచ్చే నెల నుంచి భారీగా...
ప్రస్తుతం అన్ని కార్ల కంపెనీలు ధరలు తగ్గించాయి. తమ వద్ద ఉన్న 2024 మోడల్స్ కార్లను విక్రయించేందుకు ఈ రకమైన రాయితీలను ప్రకటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా అతి పెద్ద కారు సంస్థ అయినా మారుతి సుజుకి జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీ, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటంతో అన్ని రకాల మోడళ్ల ధరలపై పెంచాలని మారుతి సుజుకి కంపెనీ నిర్ణయించింది. ఒక్కొక్క మోడల్ కు నాలుగు శాతం వరకూ ధరలు జనవరి నుంచి పెరగనున్నాయి. మారుతి సుజికితో పాటు హుందాయ్ కంపెనీ కూడా తాము తయారు చేస్తున్న అనేక మోడళ్ల పై ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని హుందాయ్ కంపెనీ ప్రకటించింది. మోడల్ ను బట్టి కారుపై ఇరవై ఐదు వేల రూపాయల వరకూ పెంచుతున్నట్లు తెలిపింది.
డిసెంబరు నెలలో అయితే...
అదే ఈ నెలలో కార్ల ను కొనుగోలు చేస్తే అనేక రాయితీలను పొందే అవకాశముందని కార్ల కంపెనీలు చెబుతున్నాయి. ఇంటీరియర్ తో పాటు సీటు కవర్లు ఫ్రీ అని కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే పాత కారు ఇస్తే భారీగా ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అయితే అదనపు రాయితీలను కూడా కార్ల కంపెనీలు ప్రకటిస్తూ డిసెంబర్ నెలలో తమ సేల్స్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్టాక్ మిగిలిపోకుండా ఉండేందుకు పెద్దయెత్తున ప్రకటనలు జారీ చేస్తున్నాయి. సొంతంగా వాహనాన్ని వినియోగించుకునే వారు మాత్రం కార్లను కొనాలంటే డిసెంబరు నెలలో పర్చేజ్ చేయడమే మంచిదన్న సూచనలను చేస్తున్నారు. ఇక తొందరెందుకు.. కారు షోరూంకు వెళ్లండి.. సొంత కారు కలను సాకారం చేసుకోండి.
Next Story