Mon Nov 25 2024 07:53:18 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : పెరగడం ప్రారంభమయిందిగా... ఇక ఆగుతుందా? డౌటేనట
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్ది మొత్తంలో పెరిగాయి
బంగారం ధరలు నిన్న మొన్నటి వరకూ దిగి వచ్చాయి. పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. కేంద్ర బడ్జెట్ లో ఇచ్చిన రాయితీల కారణంగా బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. ఎంతగా అంటే వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధరపై పది వేల రూపాయల వరకూ తగ్గింది. దీంతో కొనుగోలుదారులు కూడా పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇంకా తగ్గుతుందని కొందరు వెయిట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని భావించి జ్యుయలరీ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో బంగారం ధరలు తగ్గలేదన్నది వ్యాపారులు చెబుతున్న మాట.
శ్రావణ మాసంలో...
రానున్నది శ్రావణమాసం కావడంతో ధరలు మరింత పెరుగుతాయంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యంతో పాటు డిమాండ్ కు తగ్గ బంగారం నిల్వలు లేకపోవడం కూడా పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక పెళ్లిళ్లు మొదలవుతాయి. శుభకార్యాలు ప్రారంభం కానుండటంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పటికే అనేక మంది అడ్వాన్స్ లు ఇచ్చి మరీ ముందుగానే ఆభరణాలను బుక్ చేసుకుంటున్నారు. జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా అనేక ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్ది మొత్తంలో పెరిగాయి. అయితే భారీ స్థాయిలో పెరగకపోవడం మాత్రం పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,170 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 88,900 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story