Fri Mar 14 2025 07:08:40 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : 90 వేలకు చేరువలో బంగారం ధరలు.. ఇక కొనడం కష్టమే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి

బంగారం ధరలు దేశంలో పెరుగుతూనే ఉన్నాయి. కొనుగోళ్లతో సంబంధం లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి రావాల్సిన బంగారం నిల్వలు సరిగా రాకపోవడం వల్లనే ఈ పెరుగుదల అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం నిల్వలు తక్కువగా ఉండటం వల్లనే డిమాండ్ అధికమై ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, పెళ్లిళ్ల సీజన్ తో పెరిగిన డిమాండ్ వంటి కారణాలతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. అయితే ధరలు ఇంతటితో ఆగవని మరింతగా పెరిగే అవకాశముందని కూడా అంటున్నారు.
అడ్డూ అదుపూ లేకుండా...
బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కొనుగోళ్లు తగ్గిపోయాయి. అలాగని బంగారానికి డిమాండ్ తగ్గదు. సాధారణంగా మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటేనే బంగారం విక్రయాలు జోరుగా జరుగుతుంటాయి. ధనవంతులు పెట్టుబడి కోసం తప్పించి పెద్దగా బంగారం కోసం ఆసక్తి చూపరు. ఈ నేపథ్యంలో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు నిలిచపోవడంతో జ్యుయలరీ దుకాణాల్లో ఎక్కడి స్టాక్ అక్కడే నిలిచిపోయింది. అప్పటికీ అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నా ప్రస్తుతమున్న రేటుతో సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తగ్గుతాయేమోనని ఆలోచనలో చాలా మంది ఉన్నారు.
ధరలు పెరిగి...
అయితే ఇక బంగారం ధరలు తగ్గుతాయన్న నమ్మకం మాత్రం పూర్తిగా లేనట్లే. ఎందుకంటే రాను రాను పెరగడమే తప్పించి ధరలు తగ్గే ఛాన్స్ లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. ధరలు స్వల్పంగా ప్రతి రోజూ పెరుగుతున్నా అది వినియోగదారులకు భారంగా మారుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,710 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,960 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story