Samsung: శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు.. హెచ్చరించిన కేంద్రం!
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది..
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ కంపెనీ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ `సెర్ట్ ఇన్` వెంటనే ఆ ఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ 11,12,13,14 ఓఎస్ వర్షన్లపై పని చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉందని వెల్లడించింది.
ఈ కారణంగా వ్యక్తిగత డేటా హ్యాకర్లు తస్కరించే ముప్పు ఉందని కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖలోని సెర్ట్ ఇన్ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5తోపాటు ఆండ్రాయిడ్ 11,12,13,14 ఓఎస్ వర్షన్లతో పని చేసే అన్ని ఫోన్లలోనూ ఈ సమస్య ఉందని స్పష్టం చేసింది.
నాక్ ఫీచర్లపై నియంత్రణ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు సరిదిద్దనందున ఈ సమస్య ముందుకు వచ్చిందని సెర్ట్ ఇన్ పేర్కొంది. ఈ లోపాలను ఆసరగా చేసుకుని హ్యాకర్లు భద్రతా పరమైన అడ్డంకులను అధిగమించి యూజర్ల సున్నితమైన సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది.
ఈ ఫోన్లలో భద్రతాపరమైన లోపాలను గుర్తించి డివైజ్ పిన్, ఏఆర్ ఎమోజీ సాండ్ బాక్స్ డేటాను రీడ్ చేస్తారు. సిస్టమ్ టైం మార్చేసి నాక్స్ గార్డ్ లాక్ బైపాస్ చేసి, సున్నితమైన డేటా దొంగిలిస్తారని తెలిపింది.