కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే గిఫ్ట్, బోనస్‌లపై ట్యాక్స్ ఉంటుందా?
చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వివిధ పండగలకు బోనస్‌ను ఇస్తుంటాయి. సాధారణం
చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వివిధ పండగలకు బోనస్‌ను ఇస్తుంటాయి. సాధారణంగా ఈ బోనస్ నగదు రూపంలో ఇస్తుంటాయి. లేదా బ్యాంక్ ఖాతాలో బదిలీ చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు బోనస్ వస్తువుల రూపంలో ఇస్తుంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి కంపెనీ నుంచి నగదు రూపంలో లేదా అతని ఖాతాలో డబ్బును వచ్చినట్లయితే, అది జీతం నుంచి ఆదాయంగా పరిగణిస్తారు. బోనస్ మొత్తం ఉద్యోగి జీతంలో చేర్చుతారు. మీకు ఏ పన్ను స్లాప్ వర్తిస్తుందే దాని ప్రకారం మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఆదాయం 20% స్లాబ్‌లోకి వస్తే, మీరు బోనస్ మొత్తంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
చాలా మంది ఉద్యోగులు దీపావళి బోనస్‌గా డబ్బుకు బదులుగా వోచర్లు, కూపన్లు, గిఫ్ట్ హ్యాంపర్లు లేదా టోకెన్లను స్వీకరిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 3(7)(iv) ప్రకారం, ఒక ఉద్యోగి వోచర్/కూపన్‌ను దీపావళి బహుమతిగా స్వీకరించినట్లయితే, దాని విలువ రూ. 5000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి బహుమతి మొత్తంపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. బహుమతి విలువ రూ. 5000 దాటితే, అది మీ జీతంలో భాగంగానే గుర్తించాలి. అలాగే పన్ను స్లాబ్ ప్రకారం.. పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ నుంచి అందుకున్న బహుమతి మొత్తం 5000 రూపాయల కంటే తక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ రూ. 5,000 పరిమితి కేవలం దీపావళికి మాత్రమే కాదు.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి మాత్రమే. దీపావళి బహుమతులు ఒక సంవత్సరంలో యజమాని నుంచి అందుకున్న అన్ని బహుమతుల విలువ రూ.5000 అయినప్పుడు మాత్రమే పన్ను రహితంగా ఉంటాయి. రూ. 5,000 పరిమితి కంటే ఎక్కువ బోనస్ లేదా బహుమతి మొత్తంపై పన్ను విధిస్తారు. చాలా మంది ఉద్యోగులు కారు, బైక్, బంగారు నాణెం లేదా ఖరీదైన గాడ్జెట్లను దీపావళి బోనస్‌గా పొందుతారు. వీటికి కూడా రూ. 5000 పరిమితి వర్తిస్తుంది. బహుమతి మార్కెట్ విలువ ప్రకారం తర్వాత దాని నుంచి రూ. 5000 తీసివేయండి. తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బోనస్‌ని నగదు రూపంలో లేదా ఖాతాలో స్వీకరించినప్పుడు కంపెనీ TDSని తీసివేస్తుంది. కంపెనీ పన్ను మినహాయించనట్లయితే లేదా మీరు ఏదైనా ఖరీదైన వస్తువును బహుమతిగా స్వీకరించినట్లయితే మీరు దాని విలువను మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పకుండా చూపించాల్సి ఉంటుంది.
మీరు కూడా పండగల సమయంలో బోనస్‌ని అందుకున్నట్లయితే, అటువంటి బహుమతులు ఎల్లప్పుడూ పన్ను రహితంగా ఉండవని గుర్తుంచుకోండి. ఇక తల్లిదండ్రులు, తాతలు, జీవిత భాగస్వామి, అత్తమామలు, లేదా దగ్గరి బంధువుల నుంచి పండల సందర్భంగా బహుమతిని స్వీకరిస్తే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఎలాంటి పన్ను ఉండదు. అదే వీరు కాకుండామరెవరి నుంచి అయినా బహుమతులు పొందినట్లయితే ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల వరకు ఉన్న బహుమతులపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. బహుమతి మొత్తం రూ. 50,000 దాటితే మొత్తం బహుమతి అమౌంట్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.