ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం.. ఇక కేవలం 10 రోజుల్లోనే..
ఆదాయపు పన్ను ఫైల్ చేసే వినియోగదారులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐటీఆర్ ఫైల్..
ఆదాయపు పన్ను ఫైల్ చేసే వినియోగదారులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐటీఆర్ ఫైల్ చేయడంలో చిన్నపాటి పొరపాటు జరిగినా మీకు రీఫండ్ రావడంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. అయితే ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ రావాలంటే కొంత సమయం పట్టేది. అది కూడా అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే. లేకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో అన్ని వివరాలు సరిగ్గా పూరించిన తర్వాత దానిని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాతే రీఫండ్ వస్తుంది. అంటే రీఫండ్ రావడానికి కొంత సమయం పట్టేది. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే వార్తను తెలియజేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్నుల (ITR) ధృవీకరణ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయం 10 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా, FY 2022-23లో సగటు ప్రాసెసింగ్ సమయం 16 రోజులు, అలాగే FY 2019-20లో 82 రోజులు. సెప్టెంబర్ 5, 2023 వరకు ఆదాయపు పన్ను శాఖ డేటా ప్రకారం.. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 6.98 కోట్ల ఐటీఆర్‌లు సమర్పించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో 6.84 కోట్ల ఐటీఆర్‌లు ధృవీకరించినట్లు తెలిపింది.
5 సెప్టెంబర్ 2023 వరకు ధృవీకరించిన ఐటీఆర్‌లలో 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 6 కోట్ల ఐటీఆర్‌లు ప్రాసెస్ చేసింది ఐటీ శాఖ. అంటే 88 శాతం కంటే ఎక్కువ ధృవీకరించి ఐటీఆర్‌లు ప్రాసెస్ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి ఇప్పటికే 2.45 కోట్ల కంటే ఎక్కువ రీఫండ్లు జారీ అయ్యాయని ఆ శాఖ వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికీ అనేక ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌ను పూర్తి చేయలేదు. ఇది కాకుండా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ ప్రక్రియ సుదీర్ఘ వ్యవధిపై కొంత అసహానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐటీఆర్ ప్రాసెస్ అయ్యే వరకు రీఫండ్ బ్యాంకు ఖాతాల్లోకి చేరదు.
సెప్టెంబర్ 4, 2023 నాటికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాదాపు 14 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేసిన వారు తమ రిటర్నులను ఇంకా ధృవీకరించలేదు. దీంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను కోరింది. అదే సమయంలో అటువంటి 12 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ప్రాసెస్ చేయలేదు. వీరి నుంచి డిపార్ట్మెంట్ సమాచారం కోరింది. అయితే పన్ను చెల్లింపుదారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు ఐటీఆర్ ప్రాసెస్ చేయబడిన కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. రీఫండ్ మొత్తం కూడా నిర్ణయించింది.