ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్.. ప్రయాణికుల కోసం సూపర్ యాప్
ఇండియన్ రైల్వే.. ఇది దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తున్నారు...
ఇండియన్ రైల్వే.. ఇది దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ ఎన్నో యాప్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టికెట్స్ బుకింగ్, ఫిర్యాదుల కోసం, ట్రైన్ లైవ్ ట్రాకింగ్ కోసం, అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం యాప్స్‌ను అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పుడు మరో సారి కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే అన్ని సదుపాయాలు కూడా ఒకే యాప్‌లో ఉండనున్నాయి. రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనేది రైల్వే ఉద్దేశం.
ఇందు కోసం ఇండియన్ రైల్వే సుమారు రూ.90 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ఎకనామి టైమ్స్ తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) దీనిని డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ వల్ల ప్రయాణికులు ఇతర యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే బాధ ఉండదని, రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే యాప్‌లో లభించేలా రూపొందిస్తున్నట్లు రైల్వే వర్గాల ద్వారా సమాచారం. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా యాప్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ప్రస్తుతం రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు రైల్ కనెక్ట్ యాప్ ఒక్కటే ఉంది. దీనికి మిలియన్ల కొద్ది డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్ కాకుండా యూటీఎస్, రైల్ మదద్ యాప్స్ కూడా ఉన్నాయి. సైతం వేలాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే.. ఇకపై ఆయా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఐఆర్సీటీసీ ద్వారా అందించే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి సర్వీసులు కూడా ఈ యాప్‌లనే లభించనున్నాయి. ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం ఇంకా క్లారిటీ లేదు.