అంబానీకి మరో బెదిరింపు.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్ల డిమాండ్
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. అంబానీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదటి ఈమెయిల్‌కు స్పందించకపోవడంతో ఇప్పుడు మరో మెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఒకే ఈ-మెయిల్ అకౌంట్ నుంచి రెండు మెయిల్స్ వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. "మా ఈ-మెయిల్‌కు మీరు స్పందించలేదు. ఇప్పుడు మొత్తం రూ.200 కోట్లు ఇవ్వాలి. లేదంటే మీ డెత్ వారెంట్‌పై సంతకం చేస్తాం" అంటూ ఈమెయిల్లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. కాగా రూ.20 కోట్లు చెల్లించకుంటే కాల్చి చంపుతామని బెదిరిస్తూ శుక్రవారం ముఖేష్ అంబానీకి తొలి బెదిరింపు మెయిల్ వచ్చింది. తమ వద్ద అత్యుత్తమ షూటర్లు ఉన్నారని ఈ హెచ్చరికలో దుండగులు పేర్కొన్నారు. అయితే ముఖేష్ అంబానీ భద్రతా ఇన్ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా దక్షిణ ముంబైలోని గామ్దేవి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ముకేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలను చేర్చేందుకు షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన రోజే ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. అదే రోజున కంపెనీ జూలై-సెప్టెంబర్ ఫలితాలను ప్రకటించింది, ఇందులో ముఖేష్ అంబానీ కంపెనీ రూ.19,878 కోట్ల లాభాన్ని ఆర్జించింది.