Sat Nov 23 2024 00:35:21 GMT+0000 (Coordinated Universal Time)
Rice : బియ్యం ధరలకు రెక్కలు.. కొనాలంటే ఇక కష్టమే మరి.. కృత్రిమ కొరత సృష్టించారా?
బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు
బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో కనీస అవసరమైన బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిన ఎక్కువగా బియ్యం నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇక్కడ గోధుమల కంటే బియ్యాన్నే ఇష్టపడి తింటారు. అందులోనూ సన్నబియ్యానికి డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. కంచంలో అన్నం లేనిదే ముద్దదిగదు. ఎన్ని రోటీలు తిన్నా ఒక ముద్దకు సాటి రాదన్న ధోరణి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. బియ్యం వినియోగంతో పాటు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందుంటున్నాయి.
ఎగుమతులకు...
ఈ రెండు రాష్ట్రాల నుంచే ఎక్కువగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి అవుతుండటం కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు సాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతున్నప్పటికీ బియ్యం ధరలు మాత్రం పెరిగిపోతుండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. వ్యాపారులే కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తూ బియ్యం ధరలను పెంచుకుంటూ పోతున్నాయన్న విమర్శలున్నాయి. మిల్లర్లు, డీలర్లు కుమ్మక్కై ఈ దారుణానికి ఒడిగడుతున్నా అధికారులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. కనీస దాడులు కరవయ్యాయి. దీంతో మిల్లర్లు, వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తమకకు లాభం తెచ్చె పెట్టేలా ధరలను పెంచుకుంటూ వెళుతున్నారు.
బ్లాక్ మార్కెట్ కు...
బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో సామాన్యులు కొనాలంటేనే భయపడిపోతున్నారు. గత ఏడాది క్వింటాల్ సన్న బియ్యం ధర మూడు వేల రూపాయల నుంచి 3,500 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు అది 6,500 రూపాయలకు చేరుకుంది. దాదాపు ఏడాదిలో సగానికి సగం వ్యాపారులు, దళారులు ధరలను అమాంతం పెంచేశారు. మార్కెట్ లో ఎక్కువగా సోనా మసూరి, బీపీటీ, హెచ్ఎంటీ, ఎస్.వి.ఎస్, జైశ్రీరం వెరైటీలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. వీటి ధరలను పెంచేయడంతో కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. డిమాండ్ ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేసుకుని ధరలు పెరిగేలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని బియ్యం ధరలు దిగివచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story