Tue Nov 26 2024 15:22:31 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : సంక్రాంతికి ఇక బంగారాన్ని కొనలేమోమో... అలా పరుగులు పెడుతుంది
ఈరోజు కూడా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. వరసగా ప్రతి రోజూ పెరుగుతూ పోతూనే ఉన్నాయి. వినియోగదారులకు అందని రీతిలో పెరుగుదల ఉంటుంది. సంక్రాంతి పండగ నాటికి పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా పెళ్లిళ్ల సీజన్ మార్చి నెల వరకూ ఉండటంతో అప్పటి వరకూ బంగారం ధరలను అదుపు చేయడం కష్టమేనన్న ధోరణి వ్యాపారుల్లోనూ కనిపిస్తుంది. కొనుగోళ్లు తగ్గినా ధరలు మాత్రం దిగి రావడం లేదు.
రెండు రోజుల నుంచి...
గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బంగారం కొనుగోలు భారంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. స్టేటస్ సింబల్ గా భావించే పసిడి ఇక కొందరి పరమే అవుతుందన్న కామెంట్స్ వాస్తవరూపం దాల్చడానికి ఎంతో సమయం లేదనిపిస్తుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో బంగారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. పెట్టుబడిగా చూసేవారు, ధనికులు మాత్రమే బంగారాన్ని సొంతం చేసుకోవడం ప్రారంభమయింది.
వెండి ధర మాత్రం...
ఈరోజు కూడా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయలు పెరిగింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,500 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,820 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 79,200 రూపాయల వద్ద కొనసాగుతుంది.
Next Story