Mon Dec 23 2024 02:14:01 GMT+0000 (Coordinated Universal Time)
Wedding Season : వచ్చే నెలలో పెళ్లిళ్ల ఖర్చు ఎంతో తెలుసా? తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. నవంబరు, డిసెంబరు నెలలో వరస పెళ్లిళ్లు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు మన పెద్దలు. మన పెద్దలు చెప్పిన మాట ఇప్పటికీ అదే పరిస్థితి. పెళ్లి చేయాలంటే వేల నుంచి లక్షల్లోకి.. ఇప్పుడు కోట్ల రూపాయలకు వ్యయం చేరుకుంది. ఎవరి స్థాయిలో వారు పెళ్లిళ్లు చేస్తున్నారు. పేద వాడి నుంచి ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు కూడా పెళ్లి విషయంలో ఖర్చుకు వెనకాడరు. తమకు ఉన్నదాంట్లో ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టాలనే చూస్తున్నారు. కానీ ఎగువ, దిగువ మధ్య తరగతి ప్రజలు మాత్రం అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. అందుకోసం తాము, తమ పూర్వీకులు సంపాదించిన ఆస్తులను కూడా విక్రయించే పరిస్థితికి వచ్చిందంటే చాలు.
ఒకప్పుడు పెళ్లి అంటే...
ఒకప్పుడు పెళ్లి అంటే ఇంటి ముందు పందిరి వేసేవారు. ఇంట్లోనే వంటలు చేసేవారు. డెకరేషన్ అనే పదం పూర్వీకులకు తెలియదు. కెమెరాలు ఎవరో కొందరు మాత్రమే వినియోగించే వారు. నాడు వీడియోలు లేవు. ఏదో తమకు తోచినంత రీతిలో వస్త్రాలు నూతన దంపతులకు కొనుగోలు చేసేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ఖరీదైన హోటల్ లో పెళ్లి చేయాలి. ఇక డెకరేషన్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. లక్షల్లో పెళ్లి మండపం డెకరేషన్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక ఫొటోలు, వీడియోలకు కూడా లక్షల రూపాయలు వ్యయానికి వెనుకాడటం లేదు. ఇక భోజనాల సంగతి అయితే వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒక్కొక్క భోజనం ఖరీదు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు చేరుకుంది. అంటే పెళ్లి భోజనం ఖర్చు ఎంతో అర్థమవుతుందిగా.
రెండు నెలలు ముహూర్తాలు...
ఇక పెళ్లి వస్త్రాల కొనుగోలు విషయంలో కూడా తగ్గడం లేదు. పెళ్లికుమార్తె పట్టు చీరలు ఒకటి కాదు.. ఫొటోల కోసమో ఏమో ఎన్నో. ఇక వరుడు దుస్తుల సంగతి కూడా దాదాపు అంతే. అయితే వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. నవంబరు, డిసెంబరు నెలలో వరస పెళ్లిళ్లు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. మంచి ముహూర్తాలున్నాయి. ఈ రెండు నెలల్లో పెళ్లిళ్ల ఖర్చు ఎంతంటే? ఆరు లక్షల కోట్ల రూపాయలట. ఈ లెక్కలు ఎవరో చెప్పలేదు. సీఐఏటీ ఈ అంచనాలు వేసి మరీ రివీల్ చేసింది. నవంబరు, డిసెంబరు నెలల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. దాదాపు యాభై లక్షల వివాహాలు వివిధ స్థాయిల్లో జరిగే అవకాశం ఉందట. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయి.
Next Story