Mon Dec 23 2024 10:19:34 GMT+0000 (Coordinated Universal Time)
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఐదుగురి మృతి
పూర్తిగా మంటల్ని ఆర్పేసరికి నలుగురు స్పృహ లేకుండా, మరో వ్యక్తి కొనఊపిరితో ఉండగా.. ఆ నలుగురికి కేజీహెచ్ కు, మరొకరిని..
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లారస్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగి ఐదుగురు మృతి చెందగా.. వారిలో నలుగురు సజీవదహనమయ్యారు. లారస్ ఫార్మా కంపెనీలో యూనిట్ ఎంబీ 6 బ్లాక్ లో రియాక్టర్ కింద రబ్బరు అంటుకోవడంతో మంటలు రాజుకున్నట్లు అధికారులు తెలిపారు. యూనిట్ 3 లో సాల్వెంట్ ను క్లీన్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగడంతో.. కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. మిగతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది త్వరగానే మంటలను అదుపు చేసినా.. ప్రాణనష్టం నివారించలేకపోయింది.
పూర్తిగా మంటల్ని ఆర్పేసరికి నలుగురు స్పృహ లేకుండా, మరో వ్యక్తి కొనఊపిరితో ఉండగా.. ఆ నలుగురికి కేజీహెచ్ కు, మరొకరిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్ కు తరలించేసరికి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొక వ్యక్తి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన బంగి రాంబాబు (32), గుంటూరుకు చెందిన తలశిల రాజేశ్ బాబు (36), అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన రాపేటి రామకృష్ణ (28), చోడవరం మండలం బెన్నవోలుకు చెందిన మజ్జి వెంకటరావు (36), రంగారెడ్డికి చెందిన సతీశ్ (36)గా గుర్తించారు. ఐదుగురి కుటుంబాల్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఏపీ మంత్రి అమర్నాథ్ ప్రమాదంలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
Next Story