Tue Nov 05 2024 14:55:21 GMT+0000 (Coordinated Universal Time)
కుక్కల దాడి.. క్వారీగుంతలో పడి బాలుడు మృతి
మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కైసె దుర్యోధన్ - అనిషా దంపతులు మూడేళ్లుగా హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో..
వీధికుక్కలు కాలనీల్లో స్వైర విహారం చేస్తున్నా.. వాటిని అరికట్టే చర్యలు తీసుకోవడం లేదు మునిసిపల్ సిబ్బంది. రోడ్డుపై ఆడుకునే పిల్లలపై వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో ఘటన వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో పిల్లలంతా కలిసి వీధిలో ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. భయంతో పరుగులు తీసిన పిల్లల్లో ఒక బాలుడు కుక్కలను తప్పించుకోబోయి ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కైసె దుర్యోధన్ - అనిషా దంపతులు మూడేళ్లుగా హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఉన్న లెనిన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్ (11) నాల్గవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మనోజ్ తన స్నేహితులతో వీధిలో ఆడుకుంటూ ఉండగా.. వీధికుక్కల గుంపు వారిని తరిమాయి.
కుక్కలు వెంటపడుతుండటంతో పిల్లలంతా భయంతో పరుగులు తీశారు. కుక్కలను తప్పించుకునే క్రమంలో మనోజ్ స్థానికంగా ఉన్న క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. వీధి కుక్కల కారణంగానే తమ కొడుకు క్వారీ గుంతలో పడి మరణించాడంటూ ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు చూపరులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నగరంలో వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నా జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
Next Story