Mon Dec 23 2024 16:02:17 GMT+0000 (Coordinated Universal Time)
అంబులెన్స్ లో ఆవులు సజీవదహనం
అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపక్కనే వదిలేసి పరారవ్వగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నిజామాబాద్ : అంబులెన్స్ లో అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులు సజీవదహనమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఆవులు చనిపోవడంతో.. అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. ఇప్పుడీ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి అంబులెన్స్ స్టిక్కర్ ఉన్న వాహనంలో ఆవులను అక్రమంగా తరలించబోయింది ఓ ముఠా. నిర్మల్ నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. ఇందర్వాయి వద్దకు రాగానే వాహనంలో ఉన్న సిలిండర్ పేలిపోయింది.
దాంతో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపక్కనే వదిలేసి పరారవ్వగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే 13 ఆవులు సజీవదహనమయ్యాయి. నిజామాబాద్ పోలీసు బృందం.. అంబులెన్స్ ను, చనిపోయిన ఆవులను ఖాళీ ప్రదేశానికి తరలించగా.. వెటర్నరీ వైద్యులు ఆవులకు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడింది ఎవరన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అంబులెన్స్ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story