Mon Dec 23 2024 13:56:55 GMT+0000 (Coordinated Universal Time)
16 సంవత్సరాల బాలిక 'స్మార్ట్ ఫోన్' కోసం ఏమి చేసిందంటే..!
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగమైపోయింది. పిల్లల నుండి ముసలివాళ్ల వరకూ ఇప్పుడు ఫోన్ లేకుండా ఉండలేకపోతూ ఉన్నారు. చివరికి పిల్లలు అన్నం తినాలన్నా ముందు స్మార్ట్ ఫోన్ పెట్టాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి తీసుకుని వచ్చాం. స్మార్ట్ ఫోన్ లను కొనే స్థోమత ఉన్నవాళ్లు కొందరైతే.. ఎలాగైనా కొనాలని అందుకోసం ఏమైనా చేయాలని అనుకునే వాళ్లు ఇంకొందరు ఉన్నారు. ముఖ్యంగా టీనేజర్లు స్మార్ట్ ఫోన్ ను తమకొక స్టేటస్ సింబల్ లాగా భావిస్తూ ఉన్నారు. ఖరీదైన స్మార్ట్ఫోన్ను కలిగి ఉండాలని కలలు కనే వ్యక్తులు అందుకోసం ఏది చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు.
బెంగాల్లోని దినాజ్పూర్కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి స్మార్ట్ ఫోన్ కొనుక్కోడానికి తన రక్తాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది. ఇది ఖచ్చితంగా షాక్కు గురిచేసే కథ. 12వ తరగతి చదువుతున్న బాలిక దక్షిణ దినాజ్పూర్లోని తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దా ప్రాంతంలో ఉంటుంది. ఆమె ఆన్లైన్లో రూ. 9,000 విలువైన స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేసింది, కానీ ఆ డబ్బును సర్దడం ఆమెకు చాలా కష్టమైంది. దీంతో ఆమె బలూర్ఘాట్లోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని డబ్బుకు బదులుగా తన రక్తాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది. రక్తం ఇవ్వడానికి బదులుగా అమ్మాయి డబ్బు డిమాండ్ చేయడంతో ఆసుపత్రి సిబ్బంది షాక్ అయ్యారు. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి కనక్ దాస్ రక్తదానం చేయడానికి బదులుగా బాలిక డబ్బు డిమాండ్ చేయడంతో తమకు అనుమానం వచ్చిందని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే శిశు సంరక్షణ విభాగానికి సమాచారం అందించారు. విచారణ అనంతరం అసలు కారణం తెలుసుకున్నారు. చైల్డ్ కేర్ మెంబర్ రీటా మహ్తో ప్రకారం, ఆమెను కారణం ఏమిటని అడగ్గా.. ఫోన్ త్వరలో డెలివరీ అవుతుందని ఆ డబ్బును కూడబెట్టడానికి రక్తాన్ని విక్రయించాలనే ఆలోచన వచ్చిందని తెలిపింది.
Next Story