Mon Dec 23 2024 00:15:38 GMT+0000 (Coordinated Universal Time)
టీనేజర్ ప్రాణం తీసిన రీల్స్ మోజు
రీల్ చేసేందుకు బావిపైకి ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు దానిలో పడిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సెక్యూరిటీ గార్డుకు..
రీల్స్ మోజులో పడి ఓ టీనేజర్ ప్రాణం పోగొట్టుకున్నాడు. సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ బావి పైకి ఎక్కి డ్యాన్స్ చేయడం గుర్తుందా ? అచ్చం అలాగే రీల్ చేయబోయి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. 32 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని బావినుంచి తీశారు. ఈ విషాదఘటన మహారాష్ట్రలోని డోంబీవలీలో జూన్ 14న వెలుగుచూసింది.
డోంబీవలీ పరిధిలో ఠాకురలీ ప్రాంతానికి చెందిన బిలాల్ సోహెల్ షేక్ (18) అనే యువకుడికి రీల్స్ చేయడం అంటే మహా పిచ్చి. రకరకాల రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ అవుతున్నాడు. ఈ క్రమంలో జూన్ 11న కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఒక రీల్ ను షూట్ చేయాలని ఇద్దరు స్నేహితులతో కలిసి ముంబ్రాలోని చాంద్నగర్ సమీపంలోని బ్రిటీష్ కాలం నాటి పంప్ హౌస్కు అనుసంధానంగా ఉన్న బావి వద్దకు వచ్చాడు. ఆ బావి లోతెక్కువగా ఉండటంతో స్థానికులెవ్వరూ అక్కడికి రారు. ఒక సెక్యూరిటీ గార్డు మాత్రం కాపలాగా ఉంటాడు.
రీల్ చేసేందుకు బావిపైకి ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు దానిలో పడిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సెక్యూరిటీ గార్డుకు సమాచారమివ్వగా.. అతను విష్ణునగర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అప్పటికే బిలాల్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సరదాగా రీల్ చేస్తున్నాడని భావించామని, ఆ సరదానే తమ కొడుకును బలి తీసుకుంటుందని ఊహించలేకపోయామని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా రీల్స్ ప్రియులు ఫేమస్ అవ్వాలని రిస్క్ తో కూడిన రీల్స్ చేయకపోవడం మంచిది.
Next Story