Sat Nov 23 2024 02:49:42 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో పరువు హత్య.. కూతురి ప్రేమ విషయం తెలిసి తండ్రి దారుణం
పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అక్కచెల్లెళ్లు ముంబై ఉన్నట్లు గుర్తించి.. ఇద్దరినీ తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తుందని తెలుసుకున్న తండ్రి.. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హతమార్చాడు. ఈ విషయం బయటికి చెప్పొద్దని చిన్నకూతుర్ని బెదిరించాడు. కానీ అక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె నోరు విప్పడంతో విషయం వెలుగుచూసింది. ఈ పరువుహత్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్చన సమీపంలోని హిందూబేలా గ్రామానికి చెందిన లల్లన్కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె చాందినీ (19), చిన్న కుమార్తె ఆసియా (15). లల్లన్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
అయితే చాందినీ కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. రెండు నెలలక్రితం అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు ఆమెను వెతికి తీసుకొచ్చారు. 20 రోజుల క్రితం చెల్లెలు ఆసియాతో కలిసి మరోసారి పరారైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అక్కచెల్లెళ్లు ముంబై ఉన్నట్లు గుర్తించి.. ఇద్దరినీ తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ క్రమంలో చాందినీ ఓ యువకుడిని ప్రేమించిందని, అతని కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తండ్రి తెలుసుకున్నాడు. కోపం పట్టలేక గత శుక్రవారం అనగా మార్చి 24న ఆమెను ఓ గదిలో బంధించి విచక్షణా రహితంగా గొడ్డును బాదినట్లు బాదాడు.
తండ్రి కొట్టిన దెబ్బలను తట్టుకోలేక చాందినీ మరణించింది. ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని చిన్నకూతురు ఆసియాను బెదిరించాడు. చాందినీ కరెంట్ షాక్ కు గురై చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అనంతరం శ్మశానంలో పూడ్చిపెట్టాడు. అక్క మరణాన్ని జీర్ణించుకోలేని ఆసియా తన తండ్రే చాందినీని చంపినట్లు గ్రామస్థులకు తెలిపింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లల్లన్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు. విచారణలో చాందినీది పరువుహత్యగా తేలింది. పాతిపెట్టిన చాందినీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు యమునా నగర్ డీసీపీ సంతోష్ కుమార్ మీనా వెల్లడించారు.
Next Story