Mon Dec 23 2024 03:43:25 GMT+0000 (Coordinated Universal Time)
వాగులో కొట్టుకుపోతున్న కారు.. కుటుంబాన్ని కాపాడి తనువు చాలించిన యువతి
శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సంపతికోట ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ రమణ కుటుంబం
బీటెక్ చదువుతున్న ఆ యువతికి పాతికేళ్లైనా రాకుండానే నూరేళ్లు నిండిపోయాయి. చదువు పూర్తయ్యాక అది చేయాలి.. ఇది చేయాలి.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఆమె కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ప్రమాదంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని రక్షించుకునేందుకే ఆఖరి క్షణం వరకూ తపించింది. వరదలో కొట్టుకుపోతున్న తన వారందరినీ రక్షించుకుంది కానీ.. తను మాత్రం శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన చూపరులచే కంటతడి పెట్టిస్తోంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా బి.కొత్త కోట వద్ద సంపతికోటలో జరిగిందీ ఘటన.
శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సంపతికోట ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ రమణ కుటుంబం బెంగుళూరు నుంచి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తోంది. వాగు దాటుతుండగా వరద ఉధృతికి వారు ప్రయాణిస్తున్న కారు నీటిలో కొట్టుకుపోయింది. అదే కారులో వారి కూతురు మౌనిక (22) ఉంది. కారు కొట్టుకుపోతుంటే ఆమె భయపడలేదు. ధైర్యంగా ఉండి.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించింది. తన దగ్గరున్న ఫోన్లో నుంచి స్థానికులకు ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. వారంతా ఉరుకులు పరుగుల మీద వాగువద్దకు చేరుకున్నారు.
నీటిలో కొట్టుకుపోయిన కారును తాళ్ల సాయంతో పోలీసులు బయటకు చేర్చారు. కారులో ఉన్న డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. అయితే కారులో ఉన్న వారందరినీ రక్షించేందుకు కొన ఊపిరి వరకు యత్నించిన మౌనిక మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. మౌనిక కోసం గాలించగా.. ఉదయానికి ఆమె మృతదేహం లభ్యమైంది. తన కుటుంబాన్ని రక్షించుకునే క్రమంలో, తన రక్షణను మరిచిపోయిందంటూ స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిందని కొనియాడుతున్నారు.
Next Story