Mon Dec 23 2024 20:28:15 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. 11 ఏళ్ల బాలికపై 6గురు మైనర్లు అత్యాచారం
బాధిత బాలిక తమ పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల తనకు..
జార్ఖండ్ లో అత్యంత దారుణమైన, హేయమైన ఘటన జరిగింది. మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూ ఎదగాల్సిన పిల్లలు.. పెడదారిపడుతున్నారు. స్మార్టు ఫోన్లు చేతికొచ్చాక యువత ఆలోచనలు తప్పుదోవపడుతున్నాయి. పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటుపడిన మైనర్లు.. విచక్షణ మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన జార్ఖండ్ లోని ఖుంతి జిల్లాలో జరిగింది. ఏప్రిల్ 19న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితులంతా 10 నుంచి 15 సంవత్సరాల్లోపు వారు కావడం గమనార్హం.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాధిత బాలిక తమ పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల తనకు ఇదివరకే పరిచయం ఉన్న సదరు నిందితులతో వాగ్వాదం జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో గొడవ అక్కడికి సద్దుమణిగింది. వివాహం అనంతరం బాలిక తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్థరాత్రి స్వగ్రామానికి బయల్దేరింది. వారిని ఫాలో చేసిన నిందితులు ఆమెను అడ్డగించారు. బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధిత బాలిక స్నేహితురాళ్లు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రుల రాకతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికపై జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని సంశయించారు. ఏప్రిల్ 21, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, కరెక్షనల్ కేంద్రానికి తరలించారు.
Next Story