Mon Dec 23 2024 20:31:38 GMT+0000 (Coordinated Universal Time)
ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్
ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీమ్ కూంబింగ్ నిర్వహించగా.. కరుకు ప్రాంతం వద్ద కొందరు దుంగలను మోసుకెళ్తూ కనిపించారు. పోలీసులను..
కడప జిల్లాలోని సిద్ధవటం, రాజంపేట, తంబళ్లపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్ లో 753 కిలోల బరువుగల 62 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూల్ రేంజి డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీలు మురళీధర్, చెంచురాజు ఆధ్వర్యంలో మూడు బృందాలు శుక్రవారం నుంచి కూంబింగ్ చేపట్టాయి. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానంద టీమ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనికతో కలిసి సిద్దవటం రేంజ్, ముత్తుకూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దబ్బకోన ఫారెస్ట్ ఏరియా సమీపంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ వారిని చుట్టుముట్టడంతో కొందరు పారిపోయారు. వారిలో ఐదుగురిని పట్టుకున్నారు.
పట్టుబడిన వారు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన చిల్పం సాంబయ్య (44), యడమకంటి రమణయ్య (53), కడప జిల్లా కుంటగిరికి చెందిన ముద్దా నరసింహులు (46), ఖాజీపేటకు చెందిన నక్కా వెంకటేష్ (62), బందేవేల్ టౌన్ కు చెందిన వనం చెన్నయ్య (70) గా గుర్తించి అరెస్టు చేశారు. ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట తుమ్మలబైలు సెక్షన్ నుంచి ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీమ్ కూంబింగ్ నిర్వహించగా.. కరుకు ప్రాంతం వద్ద కొందరు దుంగలను మోసుకెళ్తూ కనిపించారు. పోలీసులను గమనించి స్మగ్లర్లు పరారయ్యారు. ఆ ప్రాంతంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
మరో సంఘటనలో.. ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ పి. నరేష్ టీమ్ పోరుమామిళ్ల మండలం, తంబళ్లపల్లి సెక్షన్ నుంచి కూంబింగ్ చేపట్టారు. నాగలకుంట్ల పోస్టు, రామేశ్వరం గ్రామంలో రాచకొండ రామయ్య ఇల్లు గ్రామం చివర ఉండటంతో అనుమానం వచ్చి అక్కడుకు చేరుకున్నారు. టాస్క్ ఫోర్సు సిబ్బందిని చూసిన రామయ్య అక్కడ నుంచి పారిపోయాడు. రామయ్య గతంలో ఫారెస్ట్ వాచర్ గా పనిచేసినట్లు గుర్తించారు. అతని ఇంట్లో సోదాలు చేయగా.. 28ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. మొత్తం రూ.60 లక్షల విలువైన 62 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కూంబింగ్ లు నిర్వహించి దుంగలు, స్మగ్లర్లను పట్టుకున్న బృందాలకు డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు.
Next Story