Mon Dec 23 2024 09:37:48 GMT+0000 (Coordinated Universal Time)
సత్య సాయి జిల్లాలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 62 ఏళ్ల జడల స్వామి
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామంలో జయకృష్ణ అలియాస్ జడల స్వామి
రంగం సినిమా చూశారా.. అందులో కోటా శ్రీనివాస రావు ఓ చిన్న పిల్లని పెళ్లి చేసుకుంటాడు. అలా చేసుకుంటే అధికారం దక్కుతుందనేది ఆ సినిమాలో చూపిస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. మైనర్ బాలికకు పట్టిన దెయ్యాన్ని విడిపిస్తానని హామీ ఇచ్చి ఓ వ్యక్తి ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు.
శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామంలో జయకృష్ణ అలియాస్ జడల స్వామి(62), 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న సంఘటన సంచలనమైంది. యల్లనూరు మండలం పాతపాలెం కు చెందిన జయకృష్ణ కొంతకాలం కిందట కృష్ణాపురం గ్రామానికి వలస వచ్చాడు. జడల స్వామిగా క్షుద్ర పూజలు చేస్తూ బతికాడు. వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. రాప్తాడు మండలానికి చెందిన వ్యక్తి తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని జడల స్వామి వద్దకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో జడల స్వామి కన్ను వారి కుమార్తెపై పడింది. ఆమెకు దెయ్యం పట్టిందని క్షుద్ర పూజలు చేసి, తాను పూజలు చేయడం వల్లనే ఆమె అనారోగ్యం బాగా అయిందని నమ్మించాడు. మూడు నెలల క్రితం గుట్టు చప్పుడు కాకుండా రాప్తాడు మండలంలోని ఓ ఆలయంలో బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక సమీప బంధువు ఈ విషయం తెలుసుకొని ఐసిడిఎస్ పీడీ శ్రీదేవికి సమాచారం అందించాడు. ఐసిడిఎస్ సిడిపిఓ ధనలక్ష్మి, రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి తో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. అరెస్టు చేస్తాడనే భయంతో నిందితుడు పరారయ్యాడు. జడలస్వామికి భార్య, కుమార్తె ఉండగా.. కుమార్తెకు వివాహమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు బాలికను అనంతపురంలోని ఉజ్వల హోం కు తరలించారు.
Next Story