Fri Dec 20 2024 13:59:23 GMT+0000 (Coordinated Universal Time)
నదిలో పడిన బస్సు.. 7 గురు మృతి, ప్రధాని దిగ్భ్రాంతి
గిరిదిహ్ నుండి రాంచీకి వెళుతున్న బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిడ్జి పైనుంచి సివాన్నే నదిలో..
50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెన పై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ లోని హజారీబాగ్ లో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారిలో ఏడుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. స్థానికులు గ్యాస్ కట్టర్లలో బస్సు చువ్వలను కట్ చేసి, బాధితులను బయటికి తీశారు. ఇద్దరు ప్రమాద స్థలంలోనే చనిపోగా.. మరో ఐదుగురు హజారీబాగ్ లోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులంతా సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఎస్పీ మనోజ్ రతన్ చెప్పిన వివరాల మేరకు.. గిరిదిహ్ నుండి రాంచీకి వెళుతున్న బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిడ్జి పైనుంచి సివాన్నే నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం బిడ్జిపై రెయిలింగ్ విరిగిన ప్రాంతంలో జరిగినట్లు ఎస్పీ తెలిపారు. బస్సు పడిన చోట నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో.. అధిక ప్రాణనష్టం జరగలేదని, బస్సు నది మధ్యలో పడిఉంటే మరింత ప్రాణనష్టం జరిగేదన్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై నుండి బస్సు పడిపోవడంతో ప్రయాణికులు మరణించడం చాలా బాధ కలిగించిందని, దేవుడు మరణించిన ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా తెలిపారు.
Next Story