Tue Mar 11 2025 06:45:16 GMT+0000 (Coordinated Universal Time)
మద్యానికి బానిసైన బాలుడు.. బీర్ సీసాతో పొడిచి వ్యక్తి హత్య
మాట మాట పెరిగి గొడవకు దారితీయగా.. విచక్షణ కోల్పోయిన బాలుడు తన చేతిలోని బీరు బాటిల్ ను పగులగొట్టి..

పాలు తాగి, పోషకాహారాలు తింటూ.. ఆడుతూ పాడుతూ స్కూలుకెళ్లి చదువుకోవాల్సిన వయసులో.. నేరస్తులుగా మారుతున్నారు. మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలై నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాలుడి వయసు 12 సంవత్సరాలే. కానీ జులాయిగా తిరుగుతూ.. అమ్మాయిల వెంట పడుతూ ఉంటాడు. చదువు మానేసి మద్యానికి బానిసై చిన్న చిన్న నేరాలు చేస్తూ.. ఇప్పుడో వ్యక్తిని హత్యచేసి హంతకుడిగా మారాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం కొన్యాలకు చెందిన 12 ఏళ్ల బాలుడు ఆరో తరగతి నుండి చదువు మానేసాడు. ఊరిలో ఉండే తాగుబోతులు, జులాయిల సహవాసం చేసి.. పూర్తిగా చెడిపోయాడు. ఫుల్లుగా మద్యం తాగడం, ఆ మత్తులో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా మారింది. అంతేకాక అమ్మాయిల వెంటపడుతూ ఏడిపించేవాడు కూడా. గత శుక్రవారం రాత్రి కొన్యాల గ్రామానికి చెందిన ఆమదయ్య బాలుడితో కలిసి మద్యం సేవించాడు. అర్థరాత్రి వరకూ.. మద్యం సేవిస్తూ ఉన్న ఇద్దరి మధ్య ఓ విషయమై వాదన వచ్చింది.
మాట మాట పెరిగి గొడవకు దారితీయగా.. విచక్షణ కోల్పోయిన బాలుడు తన చేతిలోని బీరు బాటిల్ ను పగులగొట్టి.. ఆమదయ్య గొంతులో పొడిచాడు. అతను తీవ్రరక్తస్రావంతో కిందపడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నా.. ఆ బాలుడు ఆగలేదు. ఆమదయ్య గొంతులో దించిన సీసాను కాలితో నొక్కిపట్టి అతను ప్రాణాలు తీశాడు. ఆమదయ్య చనిపోయాక అతని జేబులోని రూ.500 తీసుకుని వెళ్లిపోయాడు. ఆ రాత్రికి స్థానిక ప్రభుత్వ పాఠశాల భవనంలో పడుకుని, శనివారం ఉదయం గుమ్మడిదలకు వెళ్లి కొత్త బట్టలు కొనుక్కున్నాడు. అప్పటికే ఆమదయ్య మరణం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఆ బాలుడే హంతకుడిగా తేల్చి.. అరెస్ట్ చేశారు. తన కుటుంబ సభ్యులను ఆమదయ్య నోటికొచ్చినట్లు తిట్టడంతోనే అతడిని చంపినట్లు బాలుడు అంగీకరించాడని తెలుస్తోంది.
Next Story