Mon Dec 23 2024 09:39:32 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట వద్ద ఆదివారం మధ్యాహ్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట వద్ద ఆదివారం మధ్యాహ్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. ఆర్టీసీ బస్సును కారు బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కోరుట్ల మండలం మోమిన్ పూర్ కు చెందిన వారుగా గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇద్దరు చిన్నారులతోపాటు డ్రైవర్ సాజిద్ అలీ మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన....
పోలీసుల అంచనా, స్థానికులు చెప్పిన వివరాల మేరకు ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి మెట్ పల్లి వైపు వెళ్తుండగా.. హైదరాబాద్ నుంచి కోరుట్ల వైపు వెళ్తోన్న కారు అతి వేగంతో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు చిన్నారులు, డ్రైవర్ మృతి చెందారు. పిల్లల తల్లిదండ్రులు, మరో బాలుడు తీవ్రగాయాలపాలయ్యారు. కాగా.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఊహించని రీతిలో మరణించడంతో మోమిన్ పూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story