Mon Dec 23 2024 19:39:30 GMT+0000 (Coordinated Universal Time)
భర్తకోసం మంత్రగాడిని చంపింది.. 8 నెలల తర్వాత..
జహీర్ .. కావ్య అలియాస్ సమీరను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత..
తన భర్త తనకే సొంతమవ్వాలన్న ఉద్దేశంతో ఓ వివాహిత మంత్రగాడిని మట్టుబెట్టి.. ఆ నేరం తన సవతిపై మోపబోయి.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరు నగరంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికి చిక్కుముడి వీడింది. అప్పట్లో గోనెసంచిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. ఆ నేరంలో సవతి జైలుకెళ్తే.. భర్త తనకే సొంతమవుతాడని మొదటి భార్య పన్నిన కుట్ర ఇప్పుడు ఆమె మెడకే చుట్టుకుంది. ఈ చిక్కుముడికి సంబంధించిన వివరాలను నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
నగరంలోని ఎన్ సీసీ కాలనీకి చెందిన జహీర్ బాషా మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ షాపులో పనిచేసే కావ్య అలియాస్ సమీరకు మొదటి భర్త చనిపోయాడు. జహీర్ .. కావ్య అలియాస్ సమీరను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత జహీర్ బాషా.. అస్మా అనే యువతిని మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సమీర.. భర్తను ఎలాగైనా తానే సొంతం చేసుకోవాలని భావించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్ర పన్నింది. అందుకోసం కృష్ణాజిల్లా కలిదిండి మండలంలో వశీకరణ పూజలు చేసే మణికంఠ(33)ను సంప్రదించి.. తన భర్త తన వద్దకు వచ్చేలా వశీకరణ పూజలు చేయాలని కోరింది. అయితే అస్మాను అడ్డుతొలగించుకుంటే తన భర్త వదిలిపోడని సమీర భావించి.. కుమార్తె సాయిప్రియ, స్నేహితురాలు కృష్ణవేణితో కలిసి ప్రణాళిక సిద్ధం చేసింది.
మంత్రగాడైన మణికంఠ(33)ను చంపేసి ఆ నేరాన్ని అస్మా మీదకు నెట్టేస్తే.. ఆమె జైలుకు వెళ్తుందని, జహీర్ తప్పనిసరిగా ఇక తన వద్దకే వస్తాడని భావించింది. గతేడాది నవంబర్ 1న రాత్రి ఇంటికి వచ్చిన మణికంఠకు పాలలో అధికంగా నిద్రమాత్రలు కలిపి ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి.. తన చావుకి అస్మానే కారణమని రాసి మృతుడి జేబులో పెట్టి.. జహీర్ బాషా ఇంటివద్ద పడేశారు. నవంబర్ 2న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఒక్కొక్కరిని పలు దఫాలుగా విచారించగా.. మణికంఠ మరణానికి సమీర కారణమని తేలింది. ఆమెతో పాటు ఇందుకు సహకరించిన కుమార్తె సాయిప్రియ, స్నేహితురాలు కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story