Thu Dec 19 2024 23:42:34 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్ఎండీఏ మాజీ డీఎస్పీ జగన్ ఇంటిపై ఏసీబీ దాడులు
హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఫిర్యాదులు రావడంతో.. ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడులు చేశారు. హబ్సిగూడలో ఉన్న మాజీ డీఎస్పీ జగన్ ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో సైతం సోదాలు చేపట్టారు. హెచ్ఎండీఏ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో జగన్ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2019లో విజిలెన్స్ డీఎస్పీగా ఉన్న జగన్ను నవంబరు నెలలో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. తాజాగా హెచ్ఎండీఏకు సంబంధించి ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గరి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
రియల్టర్లతో కలసి....
హెచ్ఎండీఏలో డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో రియల్టర్లతో కలిసి భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డట్టు జగన్పై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇళ్లు.. ఇలా 10 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో జగన్ ఇంటిలో ఆస్తి పత్రాలతో పాటు కేజీ బంగారం, విలువైన దస్తావీజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం జగన్ పై కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే.. మరిన్ని అక్రమాస్తుల వివరాలు బయటికి రావచ్చని తెలుస్తోంది.
Next Story