Mon Mar 17 2025 23:49:27 GMT+0000 (Coordinated Universal Time)
కొండచరియలు విరిగిపడి.. ఏడుగురు మృతి... మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించినట్లు అధికారికవర్గాలు తెలిపాయి

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించినట్లు అధికారికవర్గాలు తెలిపాయి. మరికొంత మంది శిధిలాల కింద చిక్కుకుని ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు పదిమంది ఈ శిధిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపైనే కొండ చరియలు విరిగిపడటంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
భారీ వర్షాలకు...
కర్ణాటకలోని ఉత్తర ప్రాంతమైన అంకోలా - శిరాలి రోడ్డు పక్కన ఉన్న హోటల్ పై కొండచరియలు విరిగిపడి పెద్ద పెద్దరాళ్లు పడటంతో అందులో ఉన్న వారు మరణించారని చెబుతున్నారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సక్రమమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలను సిబ్బంది ప్రారంభించారు. మృతుల్లో ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. హోటల్ లో భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారు బయటకు రాలేకపోయారు. మఋతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
Next Story