Mon Dec 23 2024 03:48:29 GMT+0000 (Coordinated Universal Time)
యాసిడ్ దాడి.. చూపుకోల్పోయిన మహిళ
ప్రాన్సిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో పుట్టింట్లో ఉంటోంది. రెండు నెలల క్రితం విద్యానగర్ లోని ఓ డెంటల్ క్లినిక్ లో..
ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. గతరాత్రి టూ వీలర్ పై వెళ్తోన్న వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి తెగబడ్డారు. విద్యానగర్ లో ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం ఆమె విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. యాసిడ్ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విద్యానగర్ లో యడ్ల ప్రాన్సిక (35) నివాసం ఉంటోంది. ఏడాది క్రితం భర్త ఆంజనేయులతో గొడవల కారణంగా దూరంగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు.
ప్రాన్సిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో పుట్టింట్లో ఉంటోంది. రెండు నెలల క్రితం విద్యానగర్ లోని ఓ డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిస్టుగా చేరింది. మంగళవారం (జూన్ 13) రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మానిస్ట్రీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ పై వచ్చి ప్రాన్సిక పై యాసిడ్ పోశారు. ఒంటిపై యాసిడ్ పడటంతో ఆ మంటలతోనే కేకలు వేస్తూ సమీపంలోని ఇంటికి వెళ్లింది. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటంతో చెల్లెలే నీళ్లుపోసి, దుస్తులు మార్చి సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న వైద్యులు.. యాసిడ్ దాడిలో చూపుకోల్పోయినట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story