Mon Dec 23 2024 06:12:29 GMT+0000 (Coordinated Universal Time)
రెడీమేడ్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వాడేవారికి అలర్ట్.. కుళ్లిన అల్లం, మురుగునీటితో..
కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారు చేసి, అందులో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నట్లు..
మనిషి జీవనశైలి మారిపోయింది. ఒకప్పుడు ఏం తినాలన్నా అందుకు సంబంధించిన వన్నీ ఇళ్లలోనే తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. వంటింట్లో ఏం తక్కువైనా వెంటనే మార్కెట్లో తెచ్చేసుకుంటున్నారు. ఉప్పు, కారం కొనుగోళ్లు మామూలే. అవి కాకుండా మసాలా పొడులు, సాంబార్ పౌడర్, రసం పొడి, దోసె, ఇడ్లీల కు రెడీమేడ్ పిండి, ఆఖరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మార్కెట్లో రెడీమేడ్ గా లభించేదే వాడుతున్నారు. అలాంటి వారిని అలర్ట్ చేసే న్యూస్ ఇది.
ఎంత మంచి కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ కొన్నా.. ఇంట్లో తయారు చేసుకున్న టేస్ట్ రాదు. పైగా చాలావరకూ కల్తీ అవుతున్నవే అమ్మేస్తున్నారు. ఇటీవలే కల్తీ ఐస్ క్రీమ్ ల తయారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ సరకులు తయారు చేస్తోన్న ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మురుగునీటితో మ్యాంగో డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి.. వారి నుండి 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ ను స్వాధీనం చేసుకున్నారు.
కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారు చేసి, అందులో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించారు. వెల్లుల్లి పొట్టు కూడా తీయకుండా పేస్ట్ తయారు చేస్తున్నారు. అలాగే అపరిశుభ్రంగా, వ్యర్థంగా ఉన్న నీటిని, ప్రమాదకర రసాయనాలను వాడి ఆకర్షణీయమైన ప్యాకింగ్ తో ఈ నకిలీ దందా సాగుతున్నట్లు గుర్తించారు. ప్రశ్నించే అధికారులకు కాసుల ఆశచూపి నోరు మూయిస్తున్నారు. ఈ దాడిలో 500 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, హెవీ మ్యాంగ్ కూల్ డ్రింక్, మనుషులను చంపే వైట్ పౌడర్, 210 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 550 కిలోల నాన్ వెజ్ మసాజా ప్యాకెట్లు, ఒక టన్ను వెల్లుల్లి స్వాధీనం చేసుకుని, ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వినియోగదారులు ఇప్పటికైనా కళ్లుతెరిచి.. వీలైనంత వరకూ హోమ్ మేడ్ మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లను వాడాలని సూచించారు.
Next Story