Sat Dec 21 2024 02:07:28 GMT+0000 (Coordinated Universal Time)
గంజాయి మత్తులోనే శ్రద్ధ వాకర్ హత్య..ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న నిజాలు
తాను తరచూ గంజాయి తాగుతుండటంతో శ్రద్ధ తనతో గొడవపడేదని, హత్య జరిగిన రోజు కూడా గంజాయి నింపిన సిగరెట్..
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధ వాకర్(26) హత్యకేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు 5 రోజుల్లో నార్కో టెస్ట్ నిర్వహించాలని ఢిల్లీ సాకేత్ కోర్ట్ ఆదేశించింది. ఈ మేరకు రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఆదేశాలు జారీచేసింది. కాగా.. అఫ్తాబ్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని సూచించింది. ఇదిలా ఉండగా.. గంజాయి మత్తులోనే తాను శ్రద్ధ వాకర్‌ను హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
తాను తరచూ గంజాయి తాగుతుండటంతో శ్రద్ధ తనతో గొడవపడేదని, హత్య జరిగిన రోజు కూడా గంజాయి నింపిన సిగరెట్ తాగి ఇంటికి వెళ్లగా.. దానిపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని..అప్పటికే మత్తులో ఉన్న తాను ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. మే 18న శ్రద్ధ హత్య జరిగింది. కానీ అంతకన్నా ముందు నుండే ఆమెను టార్చర్ చేస్తున్నాడు అఫ్తాబ్. 2020లో అఫ్తాబ్ కొట్టిన దెబ్బలకు శ్రద్దా 4 రోజుల పాటు ఆస్పత్రి పాలైనట్టు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో శ్రద్ధ కళ్లు, ముక్కు, చెంపలు, నోటి వద్ద గాయాలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అంతేకాదు.. అప్పట్లో ఆమెను చంపేందుకు కుట్ర చేసినట్లు సమాచారం. దీనిపై శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అఫ్తాబ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తనపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శ్రద్ధ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మే 18న రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య అఫ్తాబ్ శ్రద్ధను గొంతు నులిమి చంపాడని, రాత్రంతా మృతదేహం దగ్గరే ఉండి గంజాయి నింపిన సిగరెట్లను తాగుతున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Next Story