Mon Dec 23 2024 17:47:39 GMT+0000 (Coordinated Universal Time)
Anakapalle: కాలువలో దూకిన యువతిని బయటకు తీసుకొచ్చి అత్యాచారం
అనకాపల్లి జిల్లాలో మనస్తాపంతో కాలువలో దూకిన యువతిని
అనకాపల్లి జిల్లాలో మనస్తాపంతో కాలువలో దూకిన యువతిని కాపాడిన యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన స్నేహితురాలు, మరో యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై సింహాచలం వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు కొత్తూరుకు చెందిన యువకుడు తేజ సాయి కుమార్ వీరిని అడ్డుకుని గొడవకు దిగారు. తేజసాయి కుమార్‌తో అతడి స్నేహితులు బి.శంకర్, ఎం.హరీష్, అభిలాష్, ఎన్.పవరన్, వి.రామ్ శాంతారాం కూడా ఉన్నారు.
గొడవ జరుగుతున్న సమయంలో యువతి మనస్తాపానికి గురై పక్కనే ఉన్న ఏలేరు కాలువలో దూకింది. అయితే తేజసాయి కుమార్ ఆ అమ్మాయిని కాపాడాడు. ఉడ్‌పేటలోని ఓ ఇంటికి తీసుకెళ్లి జులై 25 రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అక్కడి నుండి కూండ్రంలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. యువతి కనిపించకపోవడంతో, ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు జులై 26న అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. అదే రోజు సాయంత్రం యువతి ఇంటికి చేరుకుంది. ఏడుస్తూ తనకు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తేజసాయి కుమార్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసును నమోదు చేశారు. తేజసాయి కుమార్ మిత్రులపై కూడా కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
Next Story